Kodali Nani: ఆంజనేయస్వామిపై నేను ఒకటి మాట్లాడితే టీడీపీ మరొకటి ప్రచారం చేస్తోంది: కొడాలి నాని
- కొడాలి నాని వ్యాఖ్యలపై విపక్షాల ఆగ్రహం
- తాను తప్పేమీ మాట్లాడలేదన్న నాని
- తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తరచుగా వార్తల్లోకెక్కుతున్నారు. ఆలయాలపై దాడుల నేపథ్యంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. దీనిపై కొడాలి నాని స్పందించారు. ఆంజనేయ స్వామిపై తానొకటి మాట్లాడితే టీడీపీ మరోవిధంగా ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాను తప్పుగా మాట్లాడలేదని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
తిరుమలలో డిక్లరేషన్ ఎత్తివేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. సీఎం జగన్ తిరుమలకు హిందువుల ప్రతినిధిగా వెళ్లడంలేదని, ఆరు కోట్ల ఆంధ్రుల ముఖ్యమంత్రిగా తిరుమల వెళుతున్నారని అన్నారు. భవిష్యత్ లో కూడా ఆయన తిరుమల వెళతారని కొడాలి నాని స్పష్టం చేశారు.
తిరుమలలో డిక్లరేషన్ పై సీఎం జగన్ ను సంతకం చేయాలని అంటుండడం నీచ రాజకీయమంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గతంలో చంద్రబాబు బూట్లు వేసుకుని కొండ ఎక్కితే జగన్ చెప్పుల్లేకుండా వెళ్లారని తెలిపారు. చంద్రబాబు ఏనాడైనా తిరుమలలో గుండు చేయించుకున్నారా? అని ప్రశ్నించారు.