Jagan: ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జగన్ సమావేశం
- అమిత్ షా, షెకావత్‌తో చర్చలు
- కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చ
- ప్రాజెక్టులకు నిధులు అందించాలనివినతి
ఢిల్లీలో పర్యటిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రెండోసారి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. అమిత్ షాతో జగన్ నిన్న సాయంత్రం కూడా సమావేశమైన విషయం తెలిసిందే. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్లు సమాచారం.
మరోవైపు, ఈ రోజు ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో జగన్ భేటీ అయ్యారు. పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులకు కేంద్ర సహకారంపై ఆయన దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కూడా ఉన్నారు.
ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు అందించాలని వారు కోరారు. పోలవరం ప్రాజెక్ట్ పర్యటనకు రావాలని షెకావత్‌ను సీఎం జగన్ కోరారు. దీంతో త్వరలోనే తాను పోలవరం పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు. గోదావరి, కావేరి నధుల అనుసంధానంపైన కూడా వారి మధ్య చర్చ జరిగింది.