Kodali Nani: నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి: సీఎం రమేశ్ డిమాండ్
- ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిపై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు
- విరుచుకుపడుతున్న బీజేపీ నేతలు
- నాని వ్యాఖ్యలు అర్థరహితమన్న సీఎం రమేశ్
ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ స్పందించారు. మోదీ, ఆదిత్యనాథ్‌పై నాని చేసిన అనుచిత, అసంబద్ధ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. అవి అర్థరహిత వ్యాఖ్యలని, వెంటనే వాటిని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని రమేశ్ డిమాండ్ చేశారు.
తిరుమల వేంకటేశ్వరుడిని ముఖ్యమంత్రి జగన్ దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్‌పై సంతకం చేయాలనే అంశం దుమారం రేపుతున్న క్రమంలో నేడు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీనిపై బీజేపీ నేతలు మాట్లాడుతూ.. జగన్ సతీసమేతంగా శ్రీవారిని ఎందుకు దర్శించుకోవడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ సతీసమేతంగా వెళ్లి రాముడిని దర్శించుకోవచ్చు కదా? అన్నారు. యోగి ఆదిత్యనాథ్ భార్యతో కలసి వెళ్లే అవకాశమే లేదని పేర్కొన్నారు. దీంతో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. నాని వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ నేతలు నిప్పులు చెరుగుతుండగా, తాజాగా సీఎం రమేశ్ స్పందించారు. నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.