IPL 2020: ఆకాశమే హద్దుగా చెలరేగిన కేఎల్ రాహుల్.. పంజాబ్ చేతిలో కోహ్లీ సేన చిత్తు

Kings X1 Punjab won over Royal Challengers Bengaluru

  • రాహుల్  ఇచ్చిన క్యాచ్‌లను రెండుసార్లు విడిచిపెట్టిన కోహ్లీ
  • ఐపీఎల్‌ 2020లో తొలి సెంచరీ నమోదు
  • ఏ దశలోనూ పోరాడలేక చేతులెత్తేసిన బెంగళూరు

అంపైర్ తప్పిదం కారణంగా ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి కోహ్లీ సేనను చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. వీరవిహారం చేసి ఈ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. లక్ష్య ఛేదనలో బెంగళూరు చతికిలపడింది. ఏకంగా 97 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

207 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు 4 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. తొలి మ్యాచ్ హీరో దేవదత్ పడిక్కల్ (1) ఈసారి ఘోరంగా విఫలం కాగా, కెప్టెన్ కోహ్లీ (1) మరోమారు అభిమానులను నిరాశపరిచాడు. పంజాబ్ బౌలర్లు ముఖ్యంగా రవి బిష్ణోయ్, నిన్న జట్టులోకి వచ్చిన మురుగన్ అశ్విన్‌ల దెబ్బకు బెంగళూరు బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది.

అరోన్ ఫించ్ (20), డివిలియర్స్ (28), వాషింగ్టన్ సుందర్ (30) కాసేపు పోరాడారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితంగా 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. బెంగళూరు బౌలర్లలో రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, కాట్రెల్ 2, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ తొలి నుంచి పట్టుదలగా ఆడింది. క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడారు. 57 పరుగుల వీరి భాగస్వామ్యాన్ని చాహల్ విడదీశాడు. 20 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన మయాంక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పూరన్‌తో కలిసి రాహుల్ చెలరేగిపోయాడు. అతడికి పూరన్ కావాల్సినంత సపోర్ట్ ఇచ్చాడు. తొలుత నెమ్మదిగా ఆడిన రాహుల్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతుంటే బెంగళూరు బౌలర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు.

 కోహ్లీ రెండుసార్లు లైఫ్ ఇవ్వడంతో బతికిపోయిన రాహుల్ అదే జోరుతో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అతడి విజృంభణ కొనసాగింది. మొత్తం  69 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 14 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 132 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపి జట్టు స్కోరును 200 దాటించి బెంగళూరు ఎదుట కొండంత లక్ష్యాన్ని ఉంచాడు.

ఈ సీజన్‌లో 200కుపైగా పరుగులు చేసిన జట్టు పంజాబే. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 26, నికోలాస్ పూరన్ 17 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో శివం దూబే 2, చాహల్ ఓ వికెట్ తీశారు. బ్యాటింగ్‌లో వీర విహారం చేసి జట్టును విజయ పథాన నడిపించిన కెప్టెన్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News