Andtarvedi: అంతర్వేది రథం దగ్ధం కేసు.. విచారణకు సిద్ధమైన సీబీఐ
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక
- కేంద్రం నుంచి సీబీఐకి త్వరలో సంకేతాలు
- అంతర్వేదిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతర్వేది రథం దగ్ధం కేసును విచారించేందుకు సీబీఐ త్వరలో రంగంలోకి దిగబోతోంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సీబీఐకి కేసు బదిలీ అయిన తర్వాత విశాఖ నుంచి సీబీఐ అధికారులు అంతర్వేది వెళ్లనున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన ప్రాథమిక నివేదికను ఈ నెల 17న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. దీనిని సమీక్షించిన అనంతరం కేంద్రం నుంచి సీబీఐకి సంకేతాలు అందనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, రథం దగ్ధం తర్వాత అంతర్వేదిలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసుల నిఘా కొనసాగుతోంది. ఆలయంతోపాటు అంతర్వేదిలోని కీలక మార్గాల్లో 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. కాగా, సీబీఐ బృందం వచ్చే లోపే ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక, ప్రాథమిక విచారణ నివేదిక, సంఘటనకు సంబంధించిన దృశ్యాలతోపాటు ఇతర ఆధారాలను రెడీ చెయ్యాలని పోలీసులు నిర్ణయించారు.