SP Balasubrahmanyam: తండ్రి కోరిక నెరవేర్చేందుకు వెళ్లి అనుకోకుండా సింగర్ అయ్యాడు!
- 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీబీ
- ఇంజినీరింగ్ చదివేందుకు వెళ్లి సింగర్ అయిన వైనం
- బాలును విశేషంగా ప్రోత్సహించిన ఎస్పీ కోదండపాణి
- రికార్డింగ్ స్టూడియోకి కోదండపాణి పేరు
- శంకరాభరణం చిత్రంతో బాలు సత్తాపై తొలగిన సందేహాలు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఘనతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అనేక భారతీయ భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన మహోన్నత గాయకుడు ఎస్పీ బాలు. కొన్ని లిపిలేని భాషల్లోనూ పాడిన ఘనత ఆయన సొంతం. ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఆయనెప్పుడూ గాయకుడు అవ్వాలని అనుకోలేదు. తండ్రి కోరిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలన్నది కుర్రాడిగా ఉన్నప్పుడు బాలు ఆశయం. అందుకోసమే ఇంజినీరింగ్ లో చేరాడు.
అనేక ప్రదర్శనల్లో తన గాత్ర మాధుర్యాన్ని వినిపిస్తుండగా అనుకోకుండా సినిమా చాన్స్ వచ్చింది. ఆ విధంగానే ఆయన చిత్ర రంగప్రవేశం చేశారు. బాలు కూడా ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. తాను యాదృచ్ఛికంగానే గాయకుడ్ని అయ్యానని, అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలిపారు. అయితే బాల్యం నుంచి శాస్త్రీయ సంగీతంలో పొందిన శిక్షణ ఆయనకు సినీరంగంలో ఎదగడానికి ఎంతో ఉపకరించింది.
బాలు గురించి ఆయన క్లాస్ మేట్ కేడీపీ రావు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. అనంతపురం జేఎన్టీయూలో బాలు ఇంజినీరింగ్ ఫస్టియర్ లో చేరినప్పటి స్మృతులను కేడీపీ రావు పంచుకున్నారు. ప్రస్తుతం కేడీపీ రావు బెంగళూరులో ఉంటున్నారు. ఆయన మాట్లాడుతూ, చదువులో బాలు ఎంతో ముందుండేవాడని, పాడడంపై పెద్దగా ఆసక్తి ప్రదర్శించేవాడు కాదని తెలిపారు.
అయితే, ఈ సమయంలో అనారోగ్యం కారణంగా ఓ ఏడాది ఉన్నత చదువులకు దూరమయ్యారు. ఆ ఖాళీ సమయంలో అనేక ప్రదర్శనల్లో పాడడం ప్రారంభించాడు. నెల్లూరు జిల్లా గూడూరులో కాళిదాస కళానికేతన్ వారు నిర్వహించిన కార్యక్రమంలో సెకండ్ ప్రైజ్ రాగా, అప్పటికే సినీ రంగంలో ఉన్న ఎస్.జానకి చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు.
బహుమతి ప్రదానం చేస్తూ... మీరెందుకు సినీ రంగంలోకి రాకూడదు అని బాలును ఎస్.జానకి అడిగారు. అయితే బాలు నవ్వేస్తూ, సినీ సంగీత గాయకుడ్ని అయ్యేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందలేదని తెలిపారు. దాంతో జానకి బదులిస్తూ, తనకు కూడా కొంచెమే తెలుసని, అయినా రాణిస్తున్నానంటూ బాలును ప్రోత్సహించే ప్రయత్నం చేశారు.
జానకి మాటలతో బాలులో సినీ రంగంలోకి వెళ్లాలన్న ఆలోచన మొదలైంది. అయితే ఇంజినీరింగ్ చదవాలన్న కోరిక మాత్రం ఇంకా అలాగే ఉండడంతో మద్రాస్ లో ఏఎంఐఈలో చేరారు. మద్రాసులో ఉండడంతో అనేకమంది సంగీత దర్శకులను కలిసే అవకాశం దక్కింది. అయితే మొదట్లో చాలామంది బాలు గొంతులో పరిణతి లేదని, అటు పెద్దవాళ్ల గొంతులా లేదు, ఇటు చిన్నపిల్లల గొంతులా లేదని తిరస్కరించారు. చాలా స్టూడియోల చుట్టూ తిరిగిన బాలు ఓ దశలో ప్రయత్నాలు చాలించాలని నిర్ణయించుకున్నారు.
అన్నీ అనుకున్నట్టే జరిగితే విధి గురించి చెప్పుకోవడం ఎందుకు? ఓసారి ఆంధ్రా కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగీత పోటీ జరగ్గా, బాలుకు తెలియకుండా ఆయన రూమ్మేట్ మురళి ఆ పోటీల కోసం పేరు నమోదు చేయించాడు. దాంతో ఇష్టంలేకపోయినా బాలు ఆ పోటీలో బలవంతంగా పాల్గొనాల్సి వచ్చింది. ఆ పోటీలో మొదట్లోనే పాడిన బాలు ఆ తర్వాత ఆడియన్స్ లో కూర్చుని మిగతా పోటీదారుల పాటలు వింటూ ఆస్వాదించసాగారు.
ఇంతలో ఓ వ్యక్తి వచ్చి సినిమాల్లో పాడతావా అని అడిగారు. ఆ అడిగిన వ్యక్తి ఎస్.పి.కోదండపాణి. చిత్రరంగంలో దిగ్గజ సంగీత దర్శకుల్లో ఒకరు. ఆయన బాణీలు కట్టిన 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రంతో బాలు కెరీర్ ప్రారంభించారు. 1966లో ఆ సినిమాలో 'ఏమి ఈ వింత మోహం' అనే పాట పాడారు కానీ, ఆ సినిమా విడుదల ఆలస్యం అయింది. ఆ సినిమా కంటే ముందు 'కాలచక్రం' అనే చిత్రంలో పాడిన పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడినుంచి కోదండపాణి మార్గదర్శనంలో బాలు అంచెలంచెలుగా ఎదిగారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోదండపాణి, బాలు ఇద్దరూ బంధువులే. కానీ మొదట పరిచయం అయ్యేనాటికి ఇద్దరికీ ఆ విషయం తెలియదు. ఇక సింగర్ గా బాలు కెరీర్ మాంచి ఊపుమీదున్న దశలో ఆయన రోజుకి 10 నుంచి 21 పాటలు పాడేవారట. ఇలా బిజీ షెడ్యూల్ కారణంగా వేళకు భోంచేయకపోవడంతో ఊబకాయం బారినపడ్డానని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఓసారి స్వరపేటికకు శస్త్రచికిత్స చేయించుకున్నా, గానాన్ని మాత్రం ఆపలేదు.
అయితే, బాలుపైనా కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇండస్ట్రీలో కొత్తవాళ్లను ఆయన ప్రోత్సహించడన్న అపవాదు ఎదుర్కొన్నారు. అందుకాయన ఓ ఇంటర్వ్యూలో బదులిస్తూ... అవునండీ, నాకు బస్టాండ్ల వద్ద, రైల్వే స్టేషన్ల వద్ద గూఢచారులు ఉంటారు. వాళ్లు మద్రాసు వచ్చే ఔత్సాహిక గాయకులను గుర్తించి అట్నుంచి అటే తరిమివేస్తుంటారు అంటూ చమత్కరించారు.
కాగా, సినీ రంగంలో ఎస్పీ కోదండపాణిని తన గురువు, మార్గదర్శిగా భావించే బాలు... తాను నిర్మించిన రికార్డింగ్ స్టూడియోకి కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని పేరుపెట్టుకున్నారు. ఇక శంకరాభరణం చిత్రం వరకు బాలులోని శాస్త్రీయ సంగీత సామర్థ్యం వెలికితీసే సినిమా పడలేదు. కానీ కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం చిత్రంలో బాలు పాడిన పాటలు సూపర్ హిట్టయ్యాయి. పండితులే కాదు పామరులు సైతం పాడుకునేలా ఉన్న ఆ పాటలతో బాలు సత్తా మరింత ప్రస్ఫుటమైంది. శాస్త్రీయ సంగీతాన్ని బాలు ఎలా పలికించగలడన్న సందేహాలు ఆ సినిమాతో పటాపంచలయ్యాయి.
ఎక్కడ ఇంజినీరింగ్ స్టూడెంటు... ఎక్కడ 40 వేలకు పైగా పాటలు పాడిన గాయకుడు! విధి నడిపించిన దిశగా నడిచిన బాలు ఆపై తన స్వయంకృషితో ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఎదిగారు. చరిత్ర మర్చిపోలేని మహోన్నత గాయకుడిగా నిలిచిపోయారు. ఇవాళ ఆయన గురించి యావత్ దేశం విషాదంలో మునిగిపోవడమే అందుకు నిదర్శనం.