Radhika: ఆ పాటను ఎలా రికార్డ్ చేశారో చూపించాలని బాలుని అడుగుతుండేదాన్ని: రాధిక
- భారీ శరీరమైనా బాలుది చిన్న పిల్లాడి మనస్తత్వం
- మంచి గాయకుడే కాదు మంచి నటుడు కూడా
- ఆయన స్థానాన్ని మరెవరూ పూరించలేరు
ఎవరైనా నవరసాలను ముఖంలో పలికించగలుగుతారు. కానీ, నవరసాలను గొంతుతో పలికించిన ఘనత కేవలం దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకే దక్కుతుంది. ఆయన మరణంతో యావత్ దేశం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారు. సీనియర్ నటి రాధిక మాట్లాడుతూ బాలు లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. భారీ శరీరం అయినా ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వమని అన్నారు.
ఎస్పీబీ గొప్ప గాయకుడే కాదని, మంచి నటుడు కూడా అని రాధిక కొనియాడారు. పాడటానికి ఎంత ఉత్సుకతను ప్రదర్శిస్తుంటారో... అదే విధంగా తాను పోషించబోయే పాత్రను అర్థం చేసుకోవడానికి ఆయన అంతే ఆసక్తిని కనపరిచేవారని చెప్పారు.
'ఓ పాపా లాలీ' చిత్రంలో 'మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు' పాటను ఊపిరి తీసుకోకుండా పాడటాన్ని చూసి ఆశ్యర్యపోయానని అన్నారు. ఆ పాటను ఎలా రికార్డ్ చేయాలో చూపించాలని ఆయనను అడుగుతుండేదాన్నని చెప్పారు. మహాబలిపురంలో ఆ పాటను చిత్రీకరించారని... బాలుతో కలిసి ఆ పాటలో నటించడం జీవితంలో మర్చిపోలేనని ఓ అద్భుతమైన జ్ఞాపకమని అన్నారు. ఆయన స్థానాన్ని మరెవరూ పూరించలేరని చెప్పారు. బాలు ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.