Srirangam Sriramana: బాలు తీరని కోరిక ఇదే అనుకుంటా: శ్రీరంగం శ్రీరమణ
- కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
- బాలుతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్న ప్రముఖులు
- బాలు గారూ ఒక్కసారి రావొచ్చు కదా అంటూ శ్రీరమణ భావోద్వేగాలు
ఓ గంధర్వ గానం భువి నుంచి దివికేగింది! తరగని విషాదాన్ని మిగుల్చుతూ మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనంతవాయువుల్లో ఐక్యమయ్యారు. ఈ క్రమంలో ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖులు చెమర్చిన కళ్లను తుడుచుకుంటున్నారు. ప్రముఖ కథారచయిత శ్రీరంగం శ్రీరమణ కూడా బాలు గురించి ఓ ఆసక్తికర అంశం వెల్లడించారు. బాలు తన జీవితంలో ఎన్నో కోరికలు తీర్చుకున్నా, తీరని కోరిక ఒకటి ఉండిపోయిందని తెలిపారు.
శరద్ రుతువులో గోదావరి నదిపై పున్నమి వెన్నెల్లో బోటు విహారం చేయాలని భావించేవాడని వివరించారు. "పాపికొండల ప్రాంతం నుంచి గోదావరిలో శబరి నది కలిసేవరకు మూడు లాంచీలు, ఆరు పంట్లు (ప్లాట్ ఫాం వంటి నిర్మాణం) కట్టుకుని వాటిపై పాటలు పాడుకుంటూ ప్రయాణం చేయాలని కోరుకునేవాడు. ఆ ప్రయాణంలో తనతో పాటు బాపు-రమణ, వేటూరి, ఏఆర్ రహమాన్, డ్రమ్స్ శివమణి, ఫ్లూట్ ఆర్టిస్ట్ గుణ ఉండాలని అనుకునేవాడు. వేటూరి అప్పటికప్పుడు పాటలు రాస్తే వాటిని ఆలపించాలనేది బాలు వాంఛ. కానీ అది తీరకుండానే బాలు పోయారు. బాలు గారూ! ఒక్కసారి రావొచ్చు కదా... మన గోదావరి యాత్ర పండిచుకుందాం!" అంటూ శ్రీరమణ భావోద్వేగాలు ప్రదర్శించారు.
శ్రీరమణ రాసిన 'మిథునం' కథను కొంతకాలం కిందట తెరకెక్కించగా, అందులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కథానాయకుడిగా పాత్ర పోషించారు.