CPI Ramakrishna: విద్యుత్ మీటర్లు బిగించిన రోజు నుంచి జగన్ పతనం ప్రారంభమవుతుంది: రామకృష్ణ
- ఢిల్లీ పెద్దలకు జగన్ వంగివంగి దండాలు పెడుతున్నారు
- రూ. 4 వేల కోట్ల అప్పు కోసం మీటర్లు బిగిస్తున్నారు
- టీడీపీ ద్వంద్వ విధానాలను అవలంభిస్తోంది
వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. పలు రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు.
రూ. 4 వేల కోట్ల అప్పు కోసం జగన్ విద్యుత్ మీటర్లను బిగిస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. విద్యుత్ మీటర్లను బిగించిన రోజు నుంచే జగన్ పతనం ప్రారంభమవుతుందని అన్నారు. ఢిల్లీ పెద్దలకు జగన్ వంగివంగి దండాలు పెడుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్రంలో ఒకలా, పార్లమెంటులో మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఇళ్లు తగలబెట్టి బొగ్గులు ఏరుకోవాలనుకుంటున్నారని అన్నారు.
సీపీఎం నేత మధు మాట్లాడుతూ, దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారంటూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. కొత్త వ్యవసాయ బిల్లులను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా 29, 30 ,1 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడతామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు మత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.