Adar Punawala: అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం వద్ద రూ.80 వేల కోట్లు ఉన్నాయా?: అదర్ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు

SII CEO Adar Punawala asks Centre will have eighty thousand crore rupees for corona vaccine distribution

  • ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కోసం ట్రయల్స్ చేపడుతున్న ఎస్ఐఐ
  • కేంద్రం ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటోందన్న పూనావాలా
  • ఒక్కో వ్యాక్సిన్ రూ.1000 వరకు ధర పలకొచ్చని గతంలో వెల్లడి

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటైన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత కేంద్ర ప్రభుత్వం వద్ద రూ.80 వేల కోట్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించాలనుకుంటోందని, అలాగైతే పెద్దమొత్తంలో వ్యాక్సిన్లను కొని పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. మనం తదుపరి ఎదుర్కోవాల్సిన సవాలు ఇదేనని పేర్కొన్నారు. ఇప్పుడీ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, వ్యాక్సిన్ విషయంలో ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అని వెల్లడించారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ సంయుక్తంగా రూపొందించిన కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ కోసం సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్ లో రెండవ, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ చేపడుతోంది. అంతేకాదు, కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను భారత్ లోనే పెద్దఎత్తున ఉత్పత్తి చేయనుంది.

కాగా, సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా జూలైలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ కోసం తాము ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కొక్క డోసు ఖరీదు రూ.1000 వరకు ఉండొచ్చని సూచనప్రాయంగా తెలిపారు.

  • Loading...

More Telugu News