Zimbabwe: కోచ్ లాల్ చంద్ రాజ్ పుత్ కు పాకిస్థాన్ వీసా కోసం ప్రయత్నిస్తున్న జింబాబ్వే క్రికెట్ సంఘం
- త్వరలోనే పాకిస్థాన్ లో జింబాబ్వే పర్యటన
- అంతంతమాత్రంగా ఉన్న భారత్, పాకిస్థాన్ సంబంధాలు
- లాల్ చంద్ కు వీసా ఇవ్వాలంటూ పాక్ ను అర్థించనున్న జింబాబ్వే
2008లో ముంబయి దాడుల ఘటన జరిగిన తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థానీలు భారత్ రావాలన్నా, భారతీయులు పాకిస్థాన్ వెళ్లాలన్నా ఏమంత సులభం కాదు. ముఖ్యంగా క్రీడారంగంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు ఏమంత సజావుగా లేవు. ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఎప్పుడో నిలిచిపోయాయి. ఏదైనా ఐసీపీ ఈవెంట్ అయితే తప్ప రెండు దేశాలు పరస్పరం తలపడడం దాదాపు లేదనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో, జింబాబ్వే క్రికెట్ జట్టుకు ఓ చిక్కొచ్చి పడింది. జింబాబ్వే జట్టు త్వరలోనే పాకిస్థాన్ లో పర్యటించాల్సి ఉంది. కానీ జింబాబ్వే జట్టు కోచ్ గా వ్యవహరిస్తున్నది భారత్ కు చెందిన లాల్ చంద్ రాజ్ పుత్. కోచ్ లేకుండా ఏ జట్టయినా ఎలా పర్యటనకు వెళుతుందని జింబాబ్వే క్రికెట్ పెద్దలు భావిస్తున్నారు. అందుకే, లాల్ చంద్ కు ఎలాగైనా పాకిస్థాన్ వీసా ఇప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
"లాల్ చంద్ రాజ్ పుత్ మా జట్టు ప్రధాన కోచ్. ఆయనను జట్టుతో పాటే పాకిస్థాన్ పంపాలని కోరుకుంటున్నాం. ఆయన ప్రయాణానికి వీలు కల్పించాలంటూ అక్కడి అధికార వర్గాలకు విజ్ఞప్తి చేస్తాం" అని జింబాబ్వే క్రికెట్ బోర్డు చైర్మన్ తవెంగ్వా ముకుహ్లాని తెలిపారు. ప్రస్తుతం లాల్ చంద్ రాజ్ పుత్ భారత్ లోనే ఉన్నారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు భారత్ అనుమతిస్తే ఆయన జింబాబ్వే వెళ్లనున్నారు.