Ilayaraja: తన ప్రాణస్నేహితుడు బాలు కోసం తిరువణ్ణామలైలో దీపం వెలిగించిన ఇళయరాజా

Ilayaraja lit the Moksha Lamp at Thiruvannamalai for his dearest SP Balu

  • కన్నుమూసిన ఎస్పీబాలు
  • నిన్న అంత్యక్రియలు
  • బాలుకు మోక్ష ప్రాప్తి కోసం తిరువణ్ణామలైలో ఇళయరాజా ప్రార్థనలు

సినీ రంగంలో ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎవరికి వారే దిగ్గజాలు. ఒకరు సంగీత స్రష్ట అయితే మరొకరు గానగంధర్వుడు. కానీ ఇద్దరినీ కలిపింది సంగీతం. దాదాపు ఐదు దశాబ్దాలుగా వారు ప్రాణస్నేహితుల్లా మెలిగారు. ఇటీవల పొరపొచ్చాలు వచ్చినా టీకప్పులో తుపానులా అది వెంటనే సమసిపోయింది. ఎస్పీ బాలు కరోనా బారినపడినప్పుడు ఇళయరాజా తల్లడిల్లిపోయారు. బాలు ఇక లేరన్న వార్త తెలియగానే  ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తన ఆప్తమిత్రుడి కోసం మౌనంగా రోదించారు.

నిన్ననే ఎస్పీ బాలు అంత్యక్రియలు జరిగాయి. ఈ నేపథ్యంలో, ఇళయరాజా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో బాలు కోసం మోక్ష జ్యోతిని వెలిగించారు. తమకు అత్యంత ప్రియమైన వ్యక్తులు చనిపోయినప్పుడు వారికి సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటూ తిరువణ్ణామలై క్షేత్రంలో దీపం వెలిగించడం పరిపాటి.

ఇళయరాజా గతంలో సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కోసం ఇలాగే దీపం వెలిగించారు. ఇటీవలే తన సంగీత బృందంలో సుదీర్ఘకాలం పనిచేసిన ఓ కళాకారుడి కోసం కూడా రాజా దీపం పెట్టారు. ఇప్పుడు తన ఆరోప్రాణం వంటి ఎస్పీ బాలు కోసం బరువెక్కిన హృదయంతో మోక్ష జ్యోతిని వెలిగించారు. ఆయనకు మోక్షం ప్రాప్తించాలంటూ ఆ అరుణాచలేశ్వరుడిని ప్రార్థించారు.

  • Loading...

More Telugu News