Daggubati Purandeswari: ఏపీలో పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానం దృష్టికి తీసుకెళతా: పురందేశ్వరి
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి
- అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపిన పురందేశ్వరి
- ఏపీ రాజధానిపైనా వ్యాఖ్యలు
కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంగతి తెలిసిందే. స్వగ్రామం ప్రకాశం జిల్లా కారంచేడులో ఆమె మీడియాతో మాట్లాడుతూ, మిగతా పార్టీల కంటే బీజేపీ ఎంతో భిన్నమైనదని తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు ఆమె పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.
దక్షిణ భారతదేశంలో బీజేపీని మరింత బలోపేతం చేయాల్సి ఉందని, ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని పురందేశ్వరి పేర్కొన్నారు. ఏపీ రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని, మూడు రాజధానుల అంశంలో కేంద్రం పాత్ర పరిమితమని వివరించారు. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న సమయంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ఏమంత సులభం కాదని, అయితే ప్రజల పక్షాన నిలిచి వారిలో నమ్మకం కలిగిస్తామని అన్నారు.