Bigg Boss: అనుకున్నట్టుగానే ఎలిమినేట్ అయిన దేవీ నాగవల్లి... ఏడుస్తూ, ఏడిపిస్తూ 'బిగ్ బాస్' నుంచి బయటకు!

Devi Nagavalli Eliminated from Bigg Boss
  • దేవీ నాగవల్లి ఎలిమినేషన్ తో షాక్
  • బయటకు వచ్చి అరియానాను సేవ్ చేసిన దేవి
  • పాట పాడించి వీడ్కోలు చెప్పిన నాగార్జున
టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ నుంచి లీక్ వీరులు ఊహించినట్టుగానే టెలివిజన్ యాంకర్ దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయింది. నిన్న రాత్రి ప్రసారమైన ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున, ఆమె ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఆమె వెళ్లిపోతుంటే, మిగతా కంటెస్టెంట్ లు షాక్ తో ఉండిపోయి, ఏడుస్తూ, ఆమెకు 'బై' చెప్పారు. ఈ ఎపిసోడ్ సరదాగా సాగుతూనే, వీక్షకుల కళ్లలో నీరు తెప్పించడం గమనార్హం.

దేవీ ఎలిమినేట్ అయినట్టు తెలియగానే, అరియానా చిన్న పిల్లలా ఏడ్చేసింది. ఆమె చెయ్యిని విడిచిపెట్టకుండా పట్టుకుని, తాను వెళ్లిపోయినా బాగుండేదని బాధపడింది. అఖిల్, మెహబూబ్ కూడా కన్నీరు పెట్టుకోగా, ఆమె తన శత్రువని గతంలో వ్యాఖ్యానించిన మాస్టర్ కూడా ఏడ్చేశాడు. దీంతో దేవీ నాగవల్లి కళ్లల్లోనూ నీరు ఆగలేదు. ఇలా భావోద్వేగాల మధ్య బయటకు వచ్చిన ఆమెతో నాగ్, ఓ గేమ్ ఆడించారు.

హౌస్ లోని మిగతా కంటెస్టెంట్ల గురించి మాట్లాడించి, ఓ పాట పాడాలని కోరారు. "నువ్వుంటే నా జతగా..." అని దేవీ నాగవల్లి పాడుతుంటే, హౌస్ లో కూర్చుని చూస్తున్న ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరయ్యారు. ఇక, తనకున్న బిగ్ బాంబ్ అవకాశాన్ని అరియానాపై వేసి, ఆమెను తదుపరి వారానికిగాను నామినేషన్ నుంచి సేఫ్ చేసి, వెళ్లిపోయింది. కాగా, దేవీ ఎలిమినేషన్ తో ఓ చురుకైన, బలమైన కంటెస్టెంట్ హౌస్ ను వీడినట్లయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Bigg Boss
Bigg Boss Telugu 4
Devi Nagavalli
Eliminate

More Telugu News