IYR Krishna Rao: ఇలాంటి పరిస్థితి ప్రతి సంవత్సరం రాదు, వచ్చినప్పుడు నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉండాలి: ఐవైఆర్
- కృష్ణా నది వరద పరిస్థితులపై ఐవైఆర్ స్పందన
- వెలుగొండ ప్రాజెక్టు ప్రస్తావన
- ప్రాజెక్టు పూర్తయి ఉంటే నిండుకుండలా ఉండేదని వ్యాఖ్యలు
రాష్ట్రంలో కృష్ణా నది వరద పరిస్థితులపై మీడియాలో వచ్చిన కథనాల పట్ల మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఇలాంటి పరిస్థితి ప్రతి సంవత్సరం రాదని, వచ్చినప్పుడు నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం కలిగివుండాలని అభిప్రాయపడ్డారు.
వెలుగొండ ప్రాజెక్టు 2006లో ప్రారంభమైందని, ఒకటిన్నర దశాబ్దం అయినా ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తికాలేదని తెలిపారు. ఆ ప్రాజెక్టు పూర్తయి ఉండుంటే ఈ సీజన్ ల్లో నిండుకుండ అయ్యేదని పేర్కొన్నారు. తద్వారా వెనుకబడిన గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాలకు సాగునీరు లభించి ఉండేదని వివరించారు.
సాగునీటి ప్రాజెక్టులను రాజకీయ పార్టీల ఫండింగ్ కు కామధేనువులుగా పరిగణించినంత కాలం అంచనాలు పెరుగుతూనే ఉంటాయని, పనులు మాత్రం పూర్తికావు అని ఐవైఆర్ ట్విట్టర్ లో విమర్శించారు.