Rahul Tewatia: ఐపీఎల్ లో సంచలన ఇన్నింగ్స్... ఎవరీ రాహుల్ తెవాటియా..?

Sensational innings by Rahul Tewatia in last night IPL match

  • గతరాత్రి పంజాబ్ పై రాయల్స్ సంచలన విజయం
  • భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాయల్స్
  • 31 బంతుల్లో 53 పరుగులు చేసిన తెవాటియా
  • ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు

గతరాత్రి షార్జా క్రికెట్ మైదానంలో పరుగుల సునామీ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆ తర్వాత చేజింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ పరుగుల మోత మోగించాయి. ముఖ్యంగా పంజాబ్ తరఫున సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్, కెప్టెన్ కేఎల్ రాహుల్ రాణించగా, రాజస్థాన్ జట్టులో సంజు శాంసన్, రాహుల్ తెవాటియా అద్భుతంగా రాణించి మ్యాచ్ ను తమవైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా, రాహుల్ తెవాటియా ఆడిన సంచలన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అని చెప్పాలి.

మొదట నత్తనడకన బ్యాటింగ్ చేసి అందరిలో అసహనం కలిగించిన తెవాటియా ఆ తర్వాత గేర్లు మార్చి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన వైనం క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కాట్రెల్ బౌలింగ్ కు రాకముందే తెవాటియా స్కోరు 23 బంతుల్లో 17. కానీ ఆ ఓవర్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడీ ఎడమచేతివాటం ఆటగాడు. ఏకంగా ఐదు భారీ సిక్సర్లు కొట్టి అసాధ్యమనుకున్న లక్ష్యఛేదనను సుసాధ్యం చేశాడు. 31 బంతుల్లో 53 పరుగులు చేసిన తెవాటియా మొత్తం 7 సిక్సర్లు బాదాడు. తను అవుటైనా అప్పటికే రాజస్థాన్ ను విజయానికి దగ్గరగా చేర్చాడు.

రాయల్స్ బ్యాటింగ్ లైనప్ లో అతనొక్కడే లెఫ్ట్ హ్యాండర్ కావడంతో బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపారు. ఈ ఎత్తుగడ మొదట్లో బెడిసికొట్టినట్టే కనిపించింది. బ్యాటు ఊపుతున్నా బంతి తగలకపోవడంతో రాజస్థాన్ శిబిరంలో ఆందోళన మొదలైంది. కానీ, ఒక్కసారిగా విశ్వరూపం ప్రదర్శించి బంతిపై విరుచుకుడిన తెవాటియా తనపై మొదలైన అసహనాన్ని, కాసేపట్లోనే ఆవిరి చేశాడు. ఇప్పటిదాకా ఓ అనామకుడిలా జట్టులో కొనసాగిన రాహుల్ తెవాటియా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. తెవాటియా దెబ్బకు మయాంక్ అగర్వాల్ సెంచరీ, సంజూ శాంసన్ వీరోచిత బ్యాటింగ్ కూడా మరుగునపడ్డాయి.

ఇంతకీ ఎవరీ తెవాటియా... అంటే నిన్నటి మ్యాచ్ కు ముందు వరకు ఓ సాధారణ లెగ్ స్పిన్నర్ అని చెప్పాలి. కానీ తనలోని హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ మన్ ను సమయానుకూలంగా బయటికి తెచ్చి నికార్సయిన టీ20 ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ తెవాటియా హర్యానాకు చెందిన ఆటగాడు. వయసు 27 సంవత్సరాలు. ఇప్పటివరకు తన కెరీర్ లో 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అందులో మనవాడు చేసింది 190 పరుగులే. యావరేజ్ 17.27. లిస్ట్-ఏ పోటీల్లో 21 మ్యాచ్ లు ఆడి 484 పరుగులు చేసినా వాటిలో ఒక్క సెంచరీ కూడా లేదు.

బౌలింగ్ లో ఫర్వాలేదనిపించే తెవాటియా 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 17 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ పోటీల్లో 21 మ్యాచ్ ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. 2013లో దేశవాళీ క్రికెట్ లోకి వచ్చినా, అక్కడ కూడా పెద్దగా మెరుపులేవీ మెరిపించలేదు. కానీ ఐపీఎల్ పుణ్యమా అని నిన్న ఒక్క మ్యాచ్ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఓవైపు కాట్రెల్ 140 కిమీ పైచిలుకు వేగంతో బంతులు వేస్తున్నా, అంతకంటే బలంగా వాటిని స్టాండ్స్ లోకి పంపిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తెవాటియా గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరఫున ఐపీఎల్ లో ఆడినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. తనను అందరూ పట్టించుకునేలా అతను ఆడిందీ లేదు. గతరాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ అతడి కెరీర్ ను మలుపు తిప్పుతుందనడంలో సందేహం అక్కర్లేదు.

  • Loading...

More Telugu News