SP Charan: త్వరలోనే మా నాన్న ఆసుపత్రి బిల్లులు వెల్లడిస్తాం: ఎస్పీ చరణ్

SP Charan says soon they will release hospital bills of his father SP Balasubrahmaniam

  • చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో బాలుకు కరోనా చికిత్స
  • 50 రోజుల పాటు చికిత్స చేయడంపై ఆసుపత్రి పట్ల విమర్శలు
  • ఇలాంటి ప్రచారం వద్దన్న ఎస్పీ బాలు తనయుడు

తన అమృతగానంతో సినీ సంగీత ప్రేమికులను దశాబ్దాల పాటు అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అత్యంత విషాదకర రీతిలో కన్నుమూయడం తెలిసిందే. కరోనా రక్కసి బారినపడిన ఆయన దాదాపు 50 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే, ఇన్నిరోజుల పాటు ఎస్పీ బాలుకు చికిత్స అందించింది డబ్బు కోసమేనంటూ సోషల్ మీడియాలో చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలపై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి.

ఈ ప్రచారాన్ని ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఖండించారు. ఇలాంటి పుకార్లు కట్టిపెట్టాలని హితవు పలికారు. త్వరలోనే తన తండ్రి వైద్య చికిత్సకైన ఖర్చులు, ఆసుపత్రి బిల్లులను వెల్లడిస్తానని, ఎవరికైనా సందేహాలుంటే తొలగిపోతాయని అన్నారు. తన తండ్రి ఆసుపత్రి బిల్లుల వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు ఢిల్లీ పెద్దలు కలుగజేసుకోవాల్సి వచ్చిందన్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేశారు.

"మేం కొంతమేరకే బిల్లు చెల్లిస్తే, మిగతా బ్యాలన్స్ చెల్లిస్తేనే తన తండ్రి భౌతికకాయాన్ని అప్పగిస్తామని హాస్పిటల్ కరాఖండీగా చెప్పిందనడం, ఆపై తాను తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించగా, వారు స్పందించకపోతే భారత ఉపరాష్ట్రపతిని సాయం కోరగా, ఆయన జోక్యంతో పరిస్థితి సద్దుమణిగిందనడం.. ఇదంతా వట్టిదే" అని చరణ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News