Chalo Rajbhavan: తెలంగాణ కాంగ్రెస్ నేతల ఛలో రాజ్ భవన్ భగ్నం... అగ్రనేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
- మాణికం ఠాగూర్, రేవంత్, పొన్నం అరెస్ట్
- దిల్ కుషా గెస్ట్ హౌస్ వద్ద సీతక్క బైఠాయింపు
- గవర్నర్ ను కలిసే స్వేచ్ఛ లేకపోయిందంటూ కాంగ్రెస్ నేతల ఆగ్రహం
ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణలోనూ ఈ బిల్లులపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా, ఈ మూడు బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ దిశగా ర్యాలీ చేపట్టేందుకు యత్నించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ కూడా కదలిరాగా, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దాసోజు శ్రావణ్, పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్, ఎమ్మెల్యే సీతక్క తదితర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.
అయితే వీరిని దిల్ కుషా అతిథి గృహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మాణికం ఠాగూర్, రేవంత్ రెడ్డి, పొన్నం, రాజనర్సింహ తదితరులను అరెస్ట్ చేశారు. వారిని ప్రత్యేక వాహనాల్లో అక్కడ్నించి తరలించారు. దాంతో సీతక్క, నేరెళ్ల శారద, ఇందిరా శోభన్ వంటి మహిళా నేతలు దిల్ కుషా అతిథి గృహం గేటు వద్ద బైఠాయించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దేశానికి వెన్నెముకగా నిలిచే రైతన్నకు ఇబ్బంది కలిగించేలా కేంద్రం వ్యవసాయ బిల్లులు తెచ్చిందని, దీనికి వ్యతిరేకంగా తాము పోరాటం సాగించి తీరుతామని కాంగ్రెస్ నేతలు ఉద్ఘాటించారు. తెలంగాణ గవర్నర్ ను కలిసే స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.