Bollywood: క్షితిజ్ ప్రసాద్ ముఖం వద్ద తన కాలి బూటు పెట్టిన ఎన్సీబీ అధికారి!
- బాలీవుడ్ డగ్స్ అంశంపై విచారణను ముమ్మరం చేసిన ఎన్సీబీ
- క్షితిజ్ ప్రసాద్ ను విచారించిన అధికారులు
- క్షితిజ్ ను హింసించారని కోర్టుకు తెలిపిన లాయర్
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఎన్సీబీ విచారణను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దర్శకనిర్మాత కరణ్ జొహార్ సంస్థలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న క్షితిజ్ ప్రసాద్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ సమయంలో అధికారులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని క్షితిజ్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కరణ్ జొహార్ పేరును కానీ, లేదా సోమెల్ మిశ్రా, రాఖి, అపూర్వ, నీరజ్, రాహిల్ పేర్లను ఇరికిస్తే వదిలేస్తామని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీరు డ్రగ్స్ వాడతారని చెప్పాలని విచారణాధికారులు ఒత్తిడి చేశారని చెప్పాడు. అయితే వీరెవరితోనూ తనకు వ్యక్తిగతంగా పరిచయాలు లేవని అన్నాడు. సంబంధం లేని వ్యక్తులను ఇరికించే పని తాను చేయలేనని చెప్పారు. ఈమేరకు క్షితిజ్ స్టేట్మెంట్ ను ఆయన తరపు లాయర్ కోర్టుకు సమర్పించాడు.
క్షితిజ్ పట్ల విచారణాధికారుల్లో ఒకరైన సమీర్ వాంఖడే దారుణంగా ప్రవర్తించారని... తన చైర్ పక్కన నేలపై కూర్చోబెట్టారని, క్షితిజ్ ముఖానికి దగ్గరగా తన కాలిబూటును పెట్టారని లాయర్ తెలిపారు. హింసించారని, బ్లాక్ మెయిల్ చేయడానికి యత్నించారని చెప్పారు.