Peddireddi Ramachandra Reddy: జియాలజిస్టు నిర్దేశించిన లోతుల్లోనే బోర్లు తవ్వుతారు: మంత్రి పెద్దిరెడ్డి

AP Minister Peddireddy explains about YSR Jalakala scheme

  • ఏపీలో వైఎస్సార్ జలకళ ప్రారంభించిన సీఎం జగన్
  • మెట్ట, బీడు భూములకు నీటి సౌకర్యం
  • నాలుగేళ్లలో 2 లక్షల బోర్ల తవ్వకమే లక్ష్యం

మెట్ట, బీడు భూములకు నీటి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ ఇవాళ వైఎస్సార్ జలకళ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా అర్హులైన రైతులకు ప్రభుత్వమే ఉచితంగా బోర్లు తవ్విస్తుంది. తద్వారా 5 లక్షల ఎకరాల భూమిని సాగుబడిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో భూగర్భ జలాలు వినియోగానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైఎస్సార్ జలకళ పథకం అమలు చేయనున్నట్టు తెలిపారు.

పొలంలో హైడ్రో-జియోలాజికల్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించిన తర్వాతే బోరు బావుల నిర్మాణం ఉంటుందని, అది కూడా జియాలజిస్టులు నిర్దేశించిన లోతులోనే బోర్ల తవ్వకం ఉంటుందని వివరించారు. వైఎస్సార్ జలకళ పథకంలో తవ్వే ప్రతి బోరు బావికి జియో ట్యాగింగ్ చేస్తామని తెలిపారు. పర్యావరణానికి హాని జరగని రీతిలో, భూగర్భజలాలు అడుగంటి పోని రీతిలో బోరు బావుల తవ్వకం ఉంటుందని పెద్దిరెడ్డి వెల్లడించారు.

కాగా, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల  మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. అలాంటి 1,094 గ్రామాల్లో వైఎస్సార్ జలకళ పథకం అమలు చేయరు. ఈ ఉచిత బోరు కోసం కనీసం 2.5 ఎకరాల భూమి ఉన్న రైతు లేదా గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత బోరు కోరుకుంటున్న భూమిలో అంతకుముందు ఎలాంటి బోరు ఉండరాదు. రాబోయే నాలుగేళ్లలో వైఎస్సార్ జలకళ పథకంలో భాగంగా 2 లక్షల బోర్లు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

  • Loading...

More Telugu News