Harsha Kumar: చంద్రబాబు స్క్రిప్ట్ కాకుండా సొంతంగా స్క్రిప్ట్ రాసుకునే దమ్ముందా?: హర్షకుమార్ ను నిలదీసిన వైసీపీ ఎంపీ నందిగం సురేశ్
- బాబుకు తొత్తుగా మారి దళితులకు అన్యాయం చేస్తున్నారు
- చంద్రబాబు భజన కోసమే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్
- చింతమనేని దళితులను తిట్టినప్పుడు మీరంతా ఎక్కడున్నారు?
కొందరు నాయకులు చంద్రబాబుకు తొత్తుగా మారి దళిత జాతికి అన్యాయం చేస్తున్నారని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ విమర్శించారు. జైభీమ్ అంటూ నినాదాలు చేస్తూ దళితులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు... జైచంద్రబాబు అని నినాదాలు చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ దళిత జాతి కోసం కాదని... చంద్రబాబు భజన కోసమని విమర్శించారు. చంద్రబాబు దారుణాలకు పాల్పడుతున్నప్పుడు వీరంతా ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.
మీకెందుకురా రాజకీయాలు? అని చింతమనేని దళితులను తిట్టినప్పుడు మీరంతా ఎక్కడున్నారని నందిగం సురేశ్ నిలదీశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆదినారాయణరెడ్డి దళితులను అవమానించినప్పుడు మీరంతా ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చంద్రబాబు వ్యాఖ్యానించినప్పుడు ఎవరైనా నోరు మెదిపారా? అని ప్రశ్నించారు.
టీడీపీలో చేరేందుకు చంద్రబాబు కాళ్లను హర్షకుమార్ పట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు స్క్రిప్ట్ కాకుండా సొంతంగా స్క్రిప్ట్ రాసుకునే దమ్ముందా? అని ప్రశ్నించారు. 14 ఏళ్ల చంద్రబాబు హయాంలో దళితులకు ఎంత మేలు జరిగిందో... ఏడాదిన్నర జగన్ పాలనలో ఎంత మేలు జరిగిందో చర్చిద్దామని... దమ్ముంటే టైమ్ ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని అన్నారు.