Krishnamraju: తమ భూమికి నష్ట పరిహారం చెల్లించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు
- గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు భూమి ఇచ్చిన కృష్ణంరాజు
- సరైన నష్టపరిహారం కోరిన కృష్ణంరాజు
- ఇదే అంశంలో పిటిషన్ వేసిన నిర్మాత అశ్వనీదత్
టాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం వద్ద ఎయిర్ పోర్టు విస్తరణలో తమకు చెందిన 31 ఎకరాల భూమికి సరైన నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన న్యాయస్థానాన్ని కోరారు. తమ పొలంలో ఉన్న పంటలు, నిర్మాణాల విలువను పరిగణనలోకి తీసుకుని నష్ట పరిహారం చెల్లించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కృష్ణంరాజు పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
అటు, నిర్మాత అశ్వనీదత్ కూడా ఇదే తరహాలో హైకోర్టును ఆశ్రయించారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం తన 39 ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. గన్నవరం వద్ద ఆ భూమి ఎకరం రూ.1.54 కోట్ల మేర విలువ కలిగి ఉందని, ఆ భూమికి సరిసమాన విలువ కలిగిన భూమిని అమరావతిలో ఇస్తామని నాటి సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని అశ్వనీదత్ తన పిటిషన్ లో వివరించారు. ఇప్పుడు రాజధానిని ప్రభుత్వం అక్కడి నుంచి తరలించాలని చూడడంతో అమరావతిలో ఎకరం రూ.30 లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొందని తెలిపారు. తన పిటిషన్ లో అశ్వనీదత్... ప్రభుత్వాన్ని, ఎయిర్ పోర్టు అథారిటీని పార్టీలుగా చేర్చారు.