AIADMK: అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఎవరనేది.. అక్టోబరు 7న ప్రకటన!
- వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
- సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయించకుండానే ముగిసిన సమావేశం
- 15 తీర్మానాలకు ఆమోదం
వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న అధికార అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఎవరో వచ్చే నెల 7న తేలిపోనుంది. ఈ మేరకు ఆ పార్టీ డిప్యూటీ కో ఆర్డినేటర్ కేపీ మునుస్వామి తెలిపారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలిసి సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనున్నట్టు చెప్పారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేందుకు నిన్న చెన్నైలోని రాయపురంలో నిర్వహించిన కార్యనిర్వాహక సమావేశం సీఎం అభ్యర్థి ఎవరో తేలకుండానే ముగిసింది. కార్యాలయం వద్దకు చేరుకున్న వందలాదిమంది కార్యకర్తలు పళని, పన్నీర్‌కు మద్దతు పలుకుతూ పోటాపోటీగా నినాదాలు చేశారు.
కాగా, ఈ సమావేశంలో 15 తీర్మానాలను ఆమోదించినట్టు మునుస్వామి తెలిపారు. వీటిలో త్రిభాషా విధానానికి పార్టీ వ్యతిరేకమని పేర్కొనే తీర్మానంతోపాటు నీట్ రద్దు, జీఎస్టీ బకాయిలు, కొవిడ్ కట్టడికి మరిన్ని నిధులు కేటాయించాలనే తీర్మానాలు కూడా ఉన్నట్టు మునుస్వామి తెలిపారు.