Arvind: వ్యవసాయ బిల్లుల ఆమోదం ఏకపక్షం అంటున్న టీఆర్ఎస్ సర్కారు... వీఆర్వోల తొలగింపుపై చర్చించిందా?: ఎంపీ అరవింద్
- టీఆర్ఎస్, బీజేపీ మధ్య వ్యవసాయ బిల్లుల రగడ
- ఈ చట్టంతో రైతులకు పెట్టుబడి సమస్య ఉండదన్న అరవింద్
- రైతు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని వివరణ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ టీఆర్ఎస్ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు. కేంద్ర వ్యవసాయ బిల్లులు ఏకపక్షంగా ఆమోదించారంటున్న టీఆర్ఎస్ సర్కారు... వీఆర్వోల తొలగింపుపై ప్రతిపక్షాలతో చర్చించిందా? అని ప్రశ్నించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు పెట్టుబడి సమస్య ఉండదని స్పష్టం చేశారు. పంట అమ్మే సమయంలో ధర పెరిగితే రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చని వివరించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ రైతాంగం నుంచి పన్ను వసూలు చేసే హక్కులేదని ఆయన ఉద్ఘాటించారు.
ఇదిలావుంచితే, కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టంపై టీఆర్ఎస్ తీవ్ర వ్యతిరేకత కనబరుస్తోంది. పార్లమెంటులో ఓటింగ్ సందర్భంగా కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. వ్యతిరేకంగా ఓటు వేసింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకే ఈ చట్టం తీసుకువచ్చారంటూ టీఆర్ఎస్ అగ్రనేతలు ఆరోపిస్తున్నారు. ఈ చట్టంతో రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుందని ఎలా చెప్పగలరంటూ కేకే వంటి సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు.