Talasani: జనాల్లో లేనిపోని అపోహలు సృష్టించేందుకు యత్నిస్తున్నారు: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ దే విజయం
- అభివృద్ధి పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయి
- విపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే పార్టీని గెలిపిస్తాయని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయనంత నీచమైన రాజకీయాలను ఇక్కడి ప్రతిపక్షాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, జీవో 58, జీవో 59 ద్వారా ప్రజల ఆస్తులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే... రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
విపక్ష నేతలకు ఏం మాట్లాడాలో కూడా అర్థంకావడం లేదని తలసాని ఎద్దేవా చేశారు. కొందరేమో మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఒకసారేమో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగాలని... మరోసారేమో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని అంటూ జనాల్లో లేనిపోని అపోహలు కలిగించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.