Budda Venkanna: 850 ముఖ్యమైన పదవులు మీ జాతి వారికి ఇచ్చుకున్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా?: బుద్ధా వెంకన్న
- బీసీల అంశంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటలయుద్ధం
- బీసీలపై మాట్లాడే హక్కు జగన్, విజయసాయికి లేదన్న బుద్ధా
- రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి పంచారంటూ ఆరోపణ
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్లమెంటు నియోజకవర్గాల ఇన్చార్జిలుగా కొత్తవారిని నియమించారు. వారిలో అత్యధికంగా బీసీలకు అవకాశం ఇచ్చామని చంద్రబాబు చెప్పడంపై అధికార వైసీపీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. బీసీలపై మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి లేదని తెలిపారు. 850 ముఖ్యమైన పదవులు మీ జాతి వారికి ఇచ్చుకున్నప్పుడు బీసీలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు పంచినప్పుడు బీసీలపై ప్రేమ ఎక్కడికి పోయిందని నిలదీశారు. "బీసీ నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం మీ జాతి నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు బీసీలపై మమకారం ఎక్కడికి పోయింది? బీసీలకు వెన్నుదన్నుగా నిలిచే ఆదరణ పథకం ఎత్తేసి నిధులు పక్కదారి పట్టించి, ఆర్థికంగానూ రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయంగానూ బీసీలకు జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచినప్పుడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ ఉన్నారో!" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.