Uttar Pradesh: కుటుంబీకులకు దక్కని యూపీ గ్యాంగ్ రేప్ బాధితురాలి కడచూపు... రాత్రి పోలీసులే నిర్వహించిన అంత్యక్రియలు!
- 2012 నాటి నిర్భయ ఘటనను గుర్తు చేసిన గ్యాంగ్ రేప్
- న్యూఢిల్లీలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
- అంబులెన్స్ లో మృతదేహాన్ని నేరుగా శ్మశానానికి తరలించిన పోలీసులు
- పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
2012 నాటి నిర్భయ ఘటనను పునరావృతం చేస్తూ, యూపీలో దారుణ అత్యాచారానికి గురై, న్యూఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో నిన్న మరణించిన యువతి అంత్యక్రియలను పోలీసులు రహస్యంగా ముగించేశారు. ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కనీసం కుటుంబ సభ్యులను కూడా అనుమతించకుండా, పోలీసులే ఆమె మృతదేహాన్ని దహనం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. అత్యాచారానికి గురైన యువతి శరీరంలోని పలు ఎముకలు విరిగిపోయి, నాలుక తెగిపోయి, అవయవాలు పనిచేయని స్థితిలో మరణించింది.
యూపీలోని హత్రాస్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపగా, ఇప్పుడు పోలీసుల చర్య ప్రభుత్వంపై మరిన్ని విమర్శలను కొని తెచ్చింది. న్యూఢిల్లీ నుంచి అంబెలెన్స్ లో మృతదేహాన్ని తీసుకుని వచ్చిన పోలీసులు, కనీసం తల్లికి కడసారి చూపు కూడా దక్కనీయకుండా నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేశారు. జరుగుతున్న ఘటనను చూస్తూ, ఆమె తల్లి హృదయ విదారకంగా రోదిస్తుంటే, గ్రామస్థులు పోలీసుల తీరును దుయ్యబట్టారు.
కాగా, ఆసుపత్రి వద్దే తానున్నా, కనీసం చెప్పను కూడా చెప్పకుండా మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారని యూపీ పోలీసులపై బాధితురాలి సోదరుడు నిప్పులు చెరిగారు. ఆసుపత్రి ముందు బాధితురాలి బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటంతోనే, మరింత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడకుండా చూసేందుకు, శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా చూసేందుకు మృతదేహాన్ని తరలించాల్సి వచ్చిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. అక్కడే నిరసనల్లో ఉన్న బాధితురాలి తండ్రి, సోదరుడిని యూపీ రిజిస్టర్డ్ నంబర్ తో ఉన్న నల్ల స్కార్పియోతో పోలీసులు తరలించారు.
ఆపై ఈ వాహనాలు ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్రాస్ గ్రామానికి చేరుకోగా, ఆ వెంటనే అంత్యక్రియల క్రతువును ముగించి వేయాలని పోలీసులు నిర్ణయించారు. తెల్లారితే ఆందోళనలు పెరుగుతాయన్న అనుమానంతో భారీ భద్రత మధ్య అంబులెన్స్ ను నేరుగా శ్మశానానికి తీసుకెళ్లిపోయారు. పోలీసుల చర్యపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.