Reliance: రిలయన్స్ రిటైల్ కు మరింత ఊతం... రూ. 3,675 కోట్లతో వచ్చిన జనరల్ అట్లాంటిక్!
- 0.84 శాతం వాటా కొనుగోలు
- రూ. 4.28 లక్షల కోట్లకు రిటైల్ విలువ
- సంతోషాన్ని వ్యక్తం చేసిన ముఖేష్ అంబానీ
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ లో మరో మల్టీ నేషనల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ పార్టనర్స్ రిలయన్స్ రిటైల్ లో 0.84 శాతం వాటాను కొనుగోలు చేసే దిశగా రూ. 3,675 కోట్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈ పెట్టుబడులు రిటైల్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సహకరిస్తాయని తెలిపింది.
ఈ కొత్త పెట్టుబడితో రిలయన్స్ రిటైల్ విలువ 4.28 లక్షల కోట్లకు పెరిగినట్టు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సంస్థలోని 15 శాతం వాటాలను విక్రయించడం ద్వారా సుమారు రూ. 63 వేల కోట్ల వరకూ నిధులను సమకూర్చుకోవాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్ లో సిల్వర్ లేక్ పార్టనర్స్ 1.75 శాతం వాటాను, కేకేఆర్ అండ్ కో 1.28 శాతం వాటాలను కొనుగోలు చేయగా, 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చిందన్న విషయం తెలిసిందే.
ఇదిలావుండగా, జనరల్ అట్లాంటిక్ సంస్థ రిలయన్స్ జియోలో ఇప్పటికే రూ. 6,598 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. తాజాగా రిటైల్ విభాగంలోనూ సంస్థ భాగం కావడం పట్ల అధినేత ముఖేష్ అంబానీ, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనరల్ అట్లాంటిక్ తో తమ సంబంధం సుదీర్ఘకాలం కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్ ఇండియాకు తమ వంతు సహకారాన్ని అందించడంతో పాటు ఇండియాలో రిటైల్ రంగం సానుకూల మార్పుల దిశగా సాగుతున్న వేళ, తమవంతు పాత్ర కూడా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పెట్టుబడులు పెట్టినట్టు జనరల్ అట్లాంటిక్ సీసీఓ బిల్ ఫోర్డ్ వ్యాఖ్యానించారు.