Babri Masjid Case: బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పులో కీలకమైన ఐదు పాయింట్లు!
- నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు
- సంఘ విద్రోహ శక్తులు మసీదును కూల్చేందుకు యత్నించాయి
- నాయకులు వారిని ఆపేందుకు యత్నించారు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈరోజు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కేసులో ముద్దాయిలుగా ఉన్నవారందరూ నిర్దోషులేనని జడ్జి ఎస్కే యాదవ్ తీర్పును ఇచ్చారు.
28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. కోర్టు తీర్పుతో బీజేపీ కీలక నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులంతా నిర్దోషులుగా తేలారు. యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ కేసు తీర్పును వెలువరిస్తున్న సందర్భంగా కోర్టు పేర్కొన్న ఐదు కీలక విషయాలు ఇవి.
- బాబ్రీ మసీదు కూల్చివేత ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదు.
- నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవు.
- సీబీఐ అందించిన వీడియో, ఆడియోల ప్రామాణికత్వాన్ని విశ్వసించలేము.
- మసీదును కూల్చేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించగా... నిందితులుగా పేర్కొన్న నాయకులు వారిని ఆపేందుకు యత్నించారు.
- ప్రసంగాల ఆడియో స్పష్టంగా లేదు.