Varla Ramaiah: కోర్టులు హెచ్చరించినా డీజీపీ వైఖరి మారలేదు: వర్ల రామయ్య
- చంద్రబాబుకు డీజీపీ లేఖ రాయడంపై వర్ల ఫైర్
- వైసీపీకి అండగా నిలవాలనే ఆకాంక్ష కనిపిస్తోందని విమర్శ
- కొడాలి నానికి లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్న
జడ్జి రామకృష్ణ సోదరుడిపై జరిగిన దాడి ఏపీలో చర్చనీయాంశంగా మారింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడం... ఆ తర్వాత ఆధారాలుంటే అందించాలని, అనవసర ఆరోపణలు చేయడం సరికాదని చంద్రబాబుకు డీజీపీ ప్రత్యుత్తరం రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ తీరును వర్ల రామయ్య తప్పుపట్టారు. చంద్రబాబుకు డీజీపీ రాసిన లేఖ అనైతికంగా ఉందని అన్నారు. అధికార పార్టీకి అండగా నిలవాలనే ఆకాంక్ష డీజీపీలో కనపడుతోందని చెప్పారు.
దళితులపై దాడులకు సంబంధించి టీడీపీ లేఖలు రాసినప్పుడు డీజీపీ ఇంత వేగంగా స్పందించలేదని అన్నారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి మెప్పు కోసం డీజీపీ పని చేస్తే ఎలాగని ప్రశ్నించారు. చంద్రబాబును ఉద్దేశిస్తూ మంత్రి కొడాలి నాని పరుష వ్యాఖ్యలు చేసినప్పుడు... నానిని వారిస్తూ డీజీపీ లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కోర్టులు పలుమార్లు హెచ్చరించినా డీజీపీ తీరులో మార్పు రాలేదని విమర్శించారు. డీజీపీ రాసిన లేఖను అంత తేలికగా వదిలేది లేదని అన్నారు.