Anwar Ali: మైదానంలోనే నా గుండె ఆగాలి... ఫుట్ బాల్ ఆడేందుకు అనుమతి కోరుతూ కోర్టుకెక్కిన యువ ప్లేయర్!
- యువ ఆటగాడిగా పలు మ్యాచ్ లు ఆడిన అన్వర్
- అరుదైన గుండె జబ్బును గుర్తించిన వైద్యులు
- తనకు ఆడేందుకు అనుమతించాలని హైకోర్టులో పిటిషన్
- విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు
భారత ఫుట్ బాల్ చరిత్రలో ఓ అరుదైన ఘటన సంభవించింది. అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ యువ ఫుట్ బాలర్, తాను మరణిస్తే, మైదానంలో ఆడుతూనే మరణిస్తానని, అందుకు అనుమతించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనకు ఎంతో ఇష్టమైన ఆటను ఆడకుండా అడ్డుకోవడం తగదని కోరుతూ అతను వేసిన పిటిషన్ ను కోర్టు కూడా విచారణకు స్వీకరించింది. వివరాల్లోకి వెళితే...
పంజాబ్ కు చెందిన అన్వర్ అలీ గతంలో అండర్ 17, అండర్ 19 భారత ఫుట్ బాల్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆపై అతను గత సంవత్సరం ఐఎస్ఎల్ లో ముంబై సిటీ ఎఫ్ ఫ్రాంచైజీ తరఫున కూడా ఆడే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ టోర్నీకి ముందు ఆటగాళ్లకు జరిపిన వైద్య పరీక్షల్లో అన్వర్ కు ఎపికల్ హైపర్ కార్డియో మయోపతీ అనే అరుదైన వ్యాధి ఉందని, ఆటలో భాగంగా పరిగెడితే, ఏ క్షణమైనా హృదయం ఆగిపోతుందని వైద్యులు హెచ్చరించారు. దీంతో అతను తనకెంతో ఇష్టమైన ఆటకు దూరమయ్యాడు.
దీని తరువాత ఏడాదికి తన కెరీర్ ను పునరుద్ధరించుకునే ప్రయత్నంలో ఉన్న అతనికి ఐ-లీగ్ లో మహమ్మదాస్ స్పోర్టింగ్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. అయితే, అతని ఆరోగ్య పరిస్థితి దృష్ఠ్యా, ఆల్ ఇండియన్ ఫుల్ బాల్ ఫెడరేషన్ అడ్డుకుంది. అన్వర్ ను అన్ని రకాలుగా పరిశీలించాలని డాక్టర్ వీస్ పేస్ (టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ తండ్రి) నేతృత్వంలో వైద్య బృందాన్ని నియమించింది. వీరి రిపోర్ట్ వచ్చే వరకూ అన్వర్ మైదానంలోకి రారాదని తేల్చింది.
దీనిపై కోర్టును ఆశ్రయించిన అన్వర్, తనను అడ్డుకునే హక్కు ఏఐఎఫ్ఎఫ్ కు లేదని అంటున్నాడు. క్లబ్ నిర్ణయాల్లో సమాఖ్య జోక్యం ఏమిటని ప్రశ్నిస్తూ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో అన్వర్ తరఫు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ, తన క్లయింట్ ఫుట్ బాల్ ఆడుతూ ఉంటే కచ్చితంగా చనిపోతాడని చెప్పడానికి ఆధారాలు లేవని, గతంలో ఇద్దరు ఆటగాళ్లకు మైదానంలో గుండెపోటు వస్తే, వారు చికిత్స పొంది, తిరిగి ఆడారని గుర్తు చేశారు.
ఆపై ఏఐఎఫ్ఎఫ్ అన్వర్ ను ఆడకుండా చూడాలని చూస్తే, మొత్తం నిబంధనలను మార్చాల్సి వుంటుందని, ఆటగాళ్లందరికీ పూర్తి వైద్య పరీక్షలు చేయాలని అన్నారు. తన క్లయింట్ ను ఆడించవద్దని ఫెడరేషన్ స్వయంగా క్లబ్ కు లేఖ రాయడం తప్పని, ఇంకా నిర్ణయం వెలువడకుండానే మైదానంలోకి దిగకుండా అడ్డుకోవడం ఏంటని అన్వర్ తరఫు న్యాయవాది అమితాబ్ తివారీ ప్రశ్నించారు. అన్వర్ గురించి ఫెడరేషన్ కు నిజంగా అంత బాధ, ముందుచూపు ఉంటే మిగతా ఆటగాళ్లకు కూడా హెచ్సీఎం పరీక్షలు చేయించాలని కోరారు. కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేస్తూ, ఫెడరేషన్ కు నమాధానం ఇవ్వాలని నోటీసు పంపారు.
కాగా, తన గుండె ఆగుతుందని భావిస్తే, అది తనకెంతో ఇష్టమైన ఫుట్ బాల్ మైదానంలోనే ఆగిపోవాలని, తాను ఆడుతూ మరణించినా పర్వాలేదని, ఫుట్ బాల్ ఆడకుండా చేయాలని భావిస్తే మాత్రం, తన ప్రాణం ఇప్పుడే పోయినట్టని అన్వర్ అంటున్నాడు.