Perni Nani: బస్సుల వ్యవహారం గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ నే అడగండి: మీడియాతో పేర్ని నాని
- ఏపీ, తెలంగాణ మధ్య రోడ్డెక్కని బస్సులు
- అంతులేని ప్రశ్నలా మారిందన్న పేర్ని నాని
- జల వివాదాలతో బస్సుల వ్యవహారానికి సంబంధంలేదని వెల్లడి
ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సు సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది అంతులేని ప్రశ్నలా మారిందని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు ఎప్పుడు నడుస్తాయన్నది తెలంగాణ సీఎం కేసీఆర్ నే అడగాలని మీడియాతో మాట్లాడుతూ మంత్రి అన్నారు.
లాక్ డౌన్ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం అనుమతి ఇచ్చినా గానీ కీలక అంశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు రోడ్డెక్కలేదు.
ఏపీ నడిపే బస్సుల కిలోమీటర్లను తగ్గించాలని తెలంగాణ కోరుతోంది. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోకపోవడం వల్ల తమకు ఎంతో నష్టం వాటిల్లుతోందని తెలంగాణ వాదిస్తోంది. ఇటీవల ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల స్థాయి సమావేశాలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. అయితే, తెలంగాణతో జల వివాదాలకు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.