Armenia: అర్మేనియా, అజర్ బైజాన్ దేశాల మధ్య భీకర యుద్ధం... స్పందించిన ఇండియా!
- ఐదు రోజుల క్రితం మొదలైన యుద్ధం
- తొలుత క్రిస్టియన్, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలు
- శాంతికి కట్టుబడి వుండాలన్న భారత్
అర్మేనియా, అజర్ బైజాన్ ల మధ్య ఐదు రోజుల క్రితం మొదలైన యుద్ధం, రోజురోజుకూ తీవ్రమవుతూ, భీకరమవుతున్న వేళ, భారత్ స్పందించింది. రెండు దేశాలూ శాంతియుతంగా ఉండాలని కోరింది. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ కశ్యప్, రెండుదేశాల మధ్యా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఉద్రిక్త పరిస్థితి శాంతి విఘాతమని అభివర్ణించారు.
"ఆసియా రీజియన్ లో శాంతి భద్రతల పరిరక్షణకు భారత్ కట్టుబడివుంది. ఇరుదేశాలూ సంయమనం పాటించాలి. రెండు దేశాలూ వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలి. సరిహద్దుల్లో శాంతి పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాలి. ద్వైపాక్షిక చర్చల ద్వారానే శాంతి సాకారమవుతుందని మేము నమ్ముతున్నాం" అని అన్నారు.
కాగా, అర్మేనియాలోని క్రిస్టియన్, అజర్ బైజాన్ లోని ముస్లిం వర్గాల మధ్య మొదలైన ఘర్షణలు, రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగోర్నో, కరబఖ్ ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. పరిస్థితులను సద్దుమణిగేలా చేసి, శాంతిని నెలకొల్పేందుకు పలుదేశాలు ప్రయత్నిస్తున్నాయి.