IPL: సురేశ్ రైనా, హర్భజన్ లతో పూర్తి తెగదెంపులు చేసుకున్న సీఎస్కే!

Raina and Harbhajan Contract Termination from CSK

  • ఈ సంవత్సరం ఆటకు దూరమైన ఇద్దరు ఆటగాళ్లు
  • అధికారిక వెబ్ సైట్ నుంచి పేర్లు తొలగింపు
  • ఈ ఏడాదితో ముగియనున్న ఇద్దరి కాంట్రాక్టు
  • వచ్చే యేడాది వేలంలో పాల్గొనే అవకాశాలూ లేనట్టే

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ పసుపు రంగు జెర్సీలో మరోసారి సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లు కనిపించే అవకాశాలు ఇక లేనట్టే. తన బ్యాటింగ్ తో ఎన్నో మ్యాచ్ లలో సురేశ్ రైనా, తన బౌలింగ్ తో హర్భజన్ సీఎస్కేకు ఎన్నో విజయాలు అందించిన సంగతి తెలిసిందే.

అయితే, ఐపీఎల్ 2020 సీజన్ కు ముందు జరిగిన పరిణామాలతో వారిద్దరితో ఉన్న కాంట్రాక్ట్ సంబంధాలను తెంచుకోవాలని సీఎస్కే యాజమాన్యం తాజాగా నిర్ణయించింది. ఇప్పటికే సీఎస్కే అధికారిక వెబ్ సైట్ నుంచి వారిద్దరి పేర్లనూ తొలగించారు కూడా.

కాగా, 2018 ఐపీఎల్ వేలం నియమ నిబంధనల మేరకు హర్భజన్, రైనాలతో సీఎస్కే ఫ్రాంచైజీ 3 సంవత్సరాల కాంట్రాక్టు కుదుర్చుకుంది. వాస్తవానికి ఈ కాంట్రాక్టు తాజా సీజన్ తో ముగియనుండగా, ఆపై దాన్ని పొడిగించుకోవాలా?వద్దా? అన్న విషయం ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన విషయం. అయితే, ఈ సీజన్ లో తాము ఆడేది లేదని ఇద్దరు ఆటగాళ్ల నుంచి స్పష్టత వచ్చిన నేపథ్యంలో, అధికారికంగా వారిద్దరి కాంట్రాక్టులను తొలగించాలని సీఎస్కే నిర్ణయించింది.

సైరేశ్ రైనా రూ. 11 కోట్లకు, హర్భజన్ రూ. 2 కోట్ల వార్షిక కాంట్రాక్టుకు సీఎస్కే తరఫున ఆడుతున్నారు. అయితే, ఈ సంవత్సరం వారంతట వారే ఆట నుంచి విరమించుకోవడంతో వారికి ప్రతిఫలం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎస్కే న్యాయ నిపుణులు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో స్పందించాలని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ను సంప్రదించగా, కామెంట్ చేయడానికి ఆయన నిరాకరించారు. అయితే, వారిద్దరి కాంట్రాక్టులు రద్దు కావని మాత్రం ఆయన అనకపోవడం గమనార్హం. ఈ సంవత్సరం తమ జట్టు తరఫున ఆడని ఆటగాళ్లకు వేతనాలు చెల్లించే అవకాశమే లేదని మాత్రం ఆయన స్పష్టం చేశారు.

ఇదిలావుండగా, ఐపీఎల్ ఫ్రాంచైజీలు పాటిస్తున్న విధి విధానాలను, ఆటగాళ్ల విషయంలో అమలు చేస్తున్న నియమ నిబంధనలను అనుసరించి, రైనా, హర్భజన్ లు ఇక ఆ జట్టు తరఫున ఆడే అవకాశాలే లేవని తెలుస్తోంది. ఇక, ఒక సంవత్సరం పాటు ఆటకు దూరమైనందున ఐపీఎల్ 2021 సీజన్ లో వీరిద్దరినీ బీసీసీఐ గుర్తించి, వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా లేదని సమాచారం.

  • Loading...

More Telugu News