Donald Trump: ట్రంప్ వయసు రీత్యా కరోనా సోకడం ఎంతో ప్రమాదకరమంటున్న వైద్య నిపుణులు

Age wise Donald Trump has some risk from corona as per CDC data

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కరోనా పాజిటివ్
  • ఆసుపత్రి పాలయ్యే అవకాశాలు ఉంటాయన్న సీడీసీ
  • 70వ పడి దాటిన వారిలో మరణాల శాతం ఎక్కువేనని వెల్లడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, వైట్ హౌస్ లో అధ్యక్ష సలహాదారు హోప్ హిక్స్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి వృద్ధుల విషయంలో ప్రమాదకరం అవుతుందని, ముఖ్యంగా ఇతర వ్యాధులతో బాధపడే వృద్ధుల విషయంలో ప్రాణాంతకం అవుతుందని వైద్య నిపుణులు కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చెబుతున్నారు. ఇప్పుడు ట్రంప్ వయసు రీత్యా ఆయనకు కరోనా సోకడం ఆందోళన కలిగించే విషయమని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనాలు చెబుతున్నాయి.

ట్రంప్ వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు. అయితే, 20 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకడంతో పోల్చితే 74 ఏళ్ల ట్రంప్ ఆసుపత్రి పాలయ్యేందుకు 5 రెట్లు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధ్యయనంలో పేర్కొన్నారు. అంతేకాదు, 90 రెట్లు అధికంగా మృత్యువు కబళించే ముప్పు కూడా ఉందట. సీడీసీ గణాంకాల ప్రకారం... 18 నుంచి 29 ఏళ్ల వయసున్న కరోనా రోగులతో పోల్చితే 65 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న కరోనా రోగులు ఆసుపత్రి పాలయ్యేందుకు 5 రెట్లు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

అంతేకాదు, ట్రంప్ వయసున్న వారికి కరోనా సోకితే మరణించే శాతం 90 రెట్లు అధికం. 75 ఏళ్లకు అటూ ఇటూ వయసు కలిగిన ప్రతి 1000 మంది కరోనా రోగుల్లో 116 మంది మృత్యువాత పడుతున్నారు. అంటే మరణాల శాతం 11.6. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం ఉంటే కరోనా ప్రాణాంతకంగా మారుతుంది.

ఈ ఏడాది ట్రంప్ ఆరోగ్య వివరాలు పరిశీలిస్తే... ఆయన ఎత్తు 6.3 అడుగులు, బరువు 244 పౌండ్లు, బీఎంఐ 30.4గా పేర్కొన్నారు. ఆయన ఎత్తు, బరువును పరిశీలిస్తే ఊబకాయంతో బాధపడుతున్నట్టేనని సీడీసీ అంటోంది.  ఆయన ఫ్యామిలీ డాక్టర్ రోనీ జాక్సన్ 2018లో ట్రంప్ ఆరోగ్యం భేషుగ్గా ఉందని, అయితే ఆయన కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిదని సూచించారు.

కాగా, అమెరికా అధ్యక్షులందరిలోకి పెద్ద వయస్కుడైన ట్రంప్ మద్యం, ధూమపానాలకు దూరంగా ఉంటారు. అయితే ఆయన ఫాస్ట్ ఫుడ్, స్టీక్స్, ఐస్ క్రీమ్ లంటే మాత్రం ఎంతో ఇష్టపడతారు.

  • Loading...

More Telugu News