H1B Visa: భారత ఐటీ నిపుణులకు శుభవార్త... హెచ్1బీ వీసాలపై నిషేధం ఎత్తివేయాలంటూ కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలు
- గత జూన్ లో ట్రంప్ నిర్ణయం
- డిసెంబరు వరకు హెచ్1బీ వీసాలపై నిషేధం
- న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పలు సంస్థలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో హెచ్1బీ వీసాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడా ఉత్తర్వులపై అమెరికాలోని నార్తర్న్ కాలిఫోర్నియా కోర్టు తీర్పు వెలువరించింది. హెచ్1బీ వీసాలపై నిషేధాన్ని తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్ చర్యలు రాజ్యాంగ అధికార పరిధిని మించిపోయాయని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇమ్మిగ్రేషన్ పరిధిని నిర్ణయించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.
ఈ ఏడాది జూన్ లో హెచ్1బీ వీసాలపై డిసెంబరు వరకు నిషేధం విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం లక్షల సంఖ్యలో విదేశీ ఐటీ నిపుణులకు శరాఘాతంలా తాకింది. ముఖ్యంగా భారత ఐటీ నిపుణులకు ఈ నిర్ణయం తీవ్ర అసంతృప్తి కలిగించింది.
అయితే వీసాలపై ట్రంప్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమెరికా ఉత్పత్తిదారుల జాతీయ సమాఖ్య, యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రీటెయిల్ ఫెడరేషన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. తమ కంపెనీలకు ప్రతిభావంతులైన నిపుణులు రాకుండా ఈ నిబంధనలు అడ్డుకుంటున్నాయని ఆయా సంస్థలు తమ పిటిషన్లలో తెలిపాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజా నిర్ణయం వెలువరించింది.