Justice Liberhan: బాబ్రీ మసీదు కూల్చివేత ముమ్మాటికే కుట్రే.. జస్టిస్ లిబర్హాన్ సంచలన వ్యాఖ్యలు
- కూల్చివేత ఒక కుట్ర ప్రకారమే జరిగింది
- నిందితులంతా కుట్రదారులే
- సీబీఐ కోర్టు కాదంటే నేనేం చేయగలను?
బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక ఎలాంటి కుట్ర లేదని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు అద్వానీ, ఎంఎం జోషి, ఉమాభారతి సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.
మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం జస్టిస్ లిబర్హాన్ తో ఏకసభ్య కమిషన్ ను నియమించింది. ఆయన ఎంతోమందిని విచారించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. తాజాగా సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన స్పందించారు.
తాను సేకరించిన ఆధారాల ప్రకారం బాబ్రీ మసీదు కూల్చివేత ఒక కుట్ర ప్రకారమే జరిగిందని జస్టిస్ లిబర్హాన్ అన్నారు. కేసులోని నిందితులంతా కుట్రదారులేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విచారించిన సమయంలో ఉమాభారతి కూడా ఉద్యమానికి తానే బాధ్యత వహించానని చెప్పారని అన్నారు. ఇప్పుడు సీబీఐ కోర్టు కాదంటే తాను ఏం చేయగలనని చెప్పారు.
తన నివేదికను కోర్టు పరిగణనలోకి తీసుకుందో, లేదో కూడా తెలియదని అన్నారు. తన నివేదికతో కోర్టు ఏకీభవించాలని ఏమీ లేదని... కోర్టుకు ఇతర సాక్ష్యాలు కూడా లభించి ఉండొచ్చని ఆయన అన్నారు. జస్టిస్ లిబర్హాన్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.