TDP: 2022లో జమిలి ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి: చంద్రబాబు పిలుపు

Chandrababu said jamili elections will be held in 2022

  • అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో మాట్లాడిన బాబు
  • కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్రంలో పర్యటిస్తా
  • జగన్ బీసీల్లో చీలికలు తీసుకొచ్చారు

అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో తన ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని, కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, ప్రజలను కలిసి వారి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఎవరైనా సరే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారి నుంచి వడ్డీతో కలిపి బాకీ తీర్చుకుంటామని అన్నారు.

ఏడాదిన్నర నుంచి తనపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని, కానీ కొండను తవ్వి ఎలుక వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారని అన్నారు. పార్టీలోకి కొత్త రక్తం ఎక్కించాల్సిన పని ఉందన్న చంద్రబాబు త్వరలోనే పార్టీలోని కమిటీలన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. యువతకు ప్రాధాన్యమిచ్చి సమర్థమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. కేసుల మాఫీ కోసమే జగన్ కేంద్రం కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పెద్ద పీట వేస్తామన్నారు. నూతన నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇచ్చామని, ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఉన్నవాళ్లంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లేనన్నారు.

కరోనా నియంత్రణలో జగన్ చేతులెత్తేశారని, ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ఎప్పుడూ మాస్కు పెట్టుకోలేదన్నారు. కరోనా నుంచి రక్షణ కోసం తాము వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామని, వ్యాధి సోకకుండా ఏం చేయాలన్నదానితోపాటు ఇతర నియంత్రణ చర్యలకు సంబంధించి పూర్తి వివరాలను అందులో పొందుపరుస్తామన్నారు.

ఉపాధి హామీ పథకం బిల్లుల బకాయిలను 24 శాతం వడ్డీతో ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు పాలన చేతకాక చేతులెత్తేశారని అన్నారు. జగన్ బీసీల్లో చీలికలు తీసుకొచ్చారని ఆరోపించారు. బీసీలకు ఎటువంటి నష్టం లేకుండా కాపు రిజర్వేషన్‌ను తీసుకొస్తే, రిజర్వేషన్ ఇవ్వబోమని బహిరంగంగానే చెబుతున్నారన్నారు. కోర్టులపైనా జగన్ వర్గం ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తోందని, తాము లేకపోతే దేశంలో అరాచకం వస్తుందని హైకోర్టు చెప్పిందని చంద్రబాబు గుర్తు చేశారు.  

జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీలపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. చివరికి ఎస్సీ జడ్జిని కూడా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ యువకుడు అజయ్ ప్రాణాలు తీయడం అమానుషమన్నారు. కాంట్రాక్టులన్నీ జగన్ వర్గానికే ఇస్తున్నారని, రైతులకు తమ హయాంలో రూ. 15 వేలు ఇస్తే ఇప్పుడు రూ. 7 వేలు మాత్రమే ఇస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News