Sandalwood: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు.. కన్నీటి పర్యంతమైన యాంకర్ అనుశ్రీ
- అధికారులు విచారించినంత మాత్రాన నేరస్థురాలిని కానన్న అనుశ్రీ
- విదేశీ డ్రగ్ పెడ్లర్‌తో సంజన, రాగిణి చాటింగ్
- లేడీ రౌడీ కోసం పోలీసుల గాలింపు
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ అనుశ్రీ కన్నీటి పర్యంతమైంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేసింది. సీసీబీ అధికారులు తనను విచారించినంత మాత్రాన తాను నేరస్థురాలిని కాదని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను అప్‌లోడ్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు తెలిసిన వివరాలను అధికారులకు చెప్పానని, తాను తప్పు చేయలేదని పునరుద్ఘాటించింది.
మరోవైపు, ఈ కేసులో అరెస్ట్ అయిన వీరేన్ ఖన్నాకు నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కోర్టు నుంచి అనుమతులు తీసుకున్నారు. నార్కోటెస్టు కోసం హైదరాబాద్, లేదంటే అహ్మదాబాద్ తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అయితే, నార్కో అనాలసిస్ పరీక్షకు అతడు అంగీకరించడం లేదని సమాచారం.
కాగా, డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు విదేశీ డ్రగ్స్ సరఫరాదారులతో చాటింగ్ చేసినట్టు సీసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. కొనుగోలు చేసిన మాదకద్రవ్యాలతో బెంగళూరు శివారులోని ఫామ్‌హౌస్‌లలో పార్టీలు చేసుకున్నట్టు పక్కా సాక్ష్యాధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
డ్రగ్స్ కేసులో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ డివిజన్ (ఐఎస్‌డీ) పోలీసులు ఇద్దరు డ్రగ్స్ సరఫరాదారులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా బుల్లితెర నటీనటులతో పాటు లేడీరౌడీ పేరు వెలుగులోకి వచ్చింది. ఆమెపై బెంగళూరులోని పలు స్టేషన్లలో ఇప్పటికే కేసులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు.