Congress: జనగామ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. జంగా వర్సెస్ పొన్నాల
- జనగామలో నిన్న ‘కిసాన్ బచావో-మజ్దూర్ బచావో దివస్’ కార్యక్రమం
- దాసోజు శ్రవణ్‌కు స్వాగతం పలికేందుకు ఇరు వర్గాల పోటాపోటీ
- జంగా, పొన్నాల వర్గాల మధ్య ఘర్షణ
గాంధీ జయంతిని పురస్కరించుకుని నిన్న జనగామలో కాంగ్రెస్ నిర్వహించిన ‘కిసాన్ బచావో-మజ్దూర్ బచావో దివస్’ కార్యక్రమం రసాభాసగా మారింది. డీసీసీ చీఫ్ జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు ఒకరినొకరు నెట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వ్యవసాయ చట్టాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు పెంబర్తి కమాన్ వద్దకు చేరుకున్న జంగా, పొన్నాల వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు.
దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ ఒక దశలో ఒకరిపై ఒకరు దాడిచేసుకునేంత వరకు వెళ్లింది. దీంతో దాసోజు శ్రవణ్ షాకయ్యారు. తేరుకుని ఆయన నచ్చజెప్పినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదు. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టడంతో ఉద్రిక్తత సడలింది.