uma bharati: పార్టీలో మీకంటే సీనియర్ని...మీకు ఓ అక్కలా చెబుతున్నా..చర్యలు తీసుకోండి!: యూపీ సీఎం యోగికి ఉమాభారతి సూచన
- ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నాయకులకు అనుమతివ్వాలి
- పోలీసుల తీరు బాగోలేదు
- ప్రభుత్వానికి, బీజేపీకి మచ్చ తెచ్చేలా ఉంది
- కరోనా నుంచి కోలుకున్నాక నేనూ పరామర్శిస్తాను
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటు చేసుకున్న హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. లైంగిక వేధింపుల కేసుల్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై కూడా పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి.
తాజాగా, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో తాను యూపీ సీఎం యోగి కంటే సీనియర్‌నని, ఆయనకు అక్కలాంటి దాన్నని ఆమె అన్నారు. తన అభ్యర్థనలను, సూచనలను కొట్టిపారేయకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
పోలీసులు వ్యవహరిస్తోన్న తీరు యోగి ఆదిత్యనాథ్‌తో పాటు తమ పార్టీకీ మచ్చ తెచ్చిందని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వస్తోన్న రాజకీయ నాయకులు, మీడియాను అనుమతించాలని యోగికి సూచించారు. దళిత కుటుంబానికి చెందిన కుమార్తె ఈ ఘటనలో మృతి చెందిందంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఆమె అంతిమ సంస్కారాలను పోలీసులు హడావుడిగా జరిపారని చెప్పారు. అనంతరం కూడా ఆమె కుటుంబాన్ని, గ్రామ ప్రజలను ఎవరూ కలవకుండా చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటారని భావించే తాను ఇప్పటివరకు ఈ విషయాల గురించి ఏమీ మాట్లాడలేదని అన్నారు.
అయితే, పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు విచారకరమని ఆమె చెప్పారు. కేసుల్లో సిట్ దర్యాప్తు జరుపుతోన్న సమయంలో బాధిత కుటుంబం ఎవరితోనూ కలవకూడదనే నిబంధన ఉందా? అని ఆమె నిలదీశారు. వారిని కలవనీయకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల సిట్ దర్యాప్తుపై కూడా అనుమనాలు తలెత్తుతాయని ఆమె చెప్పారు.
తమ పార్టీ రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిందని, దేశమంతా రామరాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అయితే, హత్రాస్‌లో పోలీసుల తీరు యోగి సర్కారుతో పాటు తమ పార్టీకి మచ్చ తెస్తోందని చెప్పారు. తాను ప్రస్తుతం కొవిడ్-19కి చికిత్స తీసుకుంటున్నానని ఆమె వివరించారు.
కరోనా సోకకపోతే తాను ఇప్పటికే బాధిత కుటుంబాన్ని కలిసేదాన్నని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తాను బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని తెలిపారు. బాధిత కుటుంబాన్ని కలిసేందుకు నాయకులను అనుమతించాలని యోగి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆమె చెప్పారు.