Madhusudan Reddy: పారామోటారింగ్ చేస్తుండగా అపశ్రుతి... సముద్రంలో పడి మృతి చెందిన నేవీ కెప్టెన్
- కర్ణాటకలోని కార్వార్ లో విషాదం
- బీచ్ కు వెళ్లి మృత్యువాత పడిన కెప్టెన్
- సముద్రంలో కుప్పకూలిన పారామోటార్
ఓ నేవీ కెప్టెన్ దురదృష్టకర పరిస్థితుల్లో సముద్రంలో పడి చనిపోయిన ఘటన కర్ణాటకలో జరిగింది. 55 ఏళ్ల మధుసూదన్ రెడ్డి కార్వార్ నేవీ కేంద్రంలో కెప్టెన్ గా పనిచేస్తున్నాడు. మిత్రుడు విద్యాధర్ వైద్యతో కలిసి బీచ్ లో పారామోటారింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఇద్దరూ సముద్రంలో పడిపోయారు.
విద్యాధర్ ఓ పారాపైలట్. పారామోటార్ ను ఆయనే సముద్రం వద్దకు తీసుకువచ్చాడు. శుక్రవారం సాయంత్రం కెప్టెన్ మధుసూదన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బీచ్ వద్దకు రాగా, విద్యాధర్ వైద్య ఆ కెప్టెన్ కుటుంబసభ్యులందరితో పారామోటారింగ్ చేయించాడు. చివరగా కెప్టెన్ మధుసూదన్ రెడ్డితో పారామోటారింగ్ చేయిస్తుండగా, ఒక్కసారిగా పారామోటార్ యంత్రం నిలిచిపోయింది.
అప్పటికి వారు గాల్లో 100 అడుగుల ఎత్తులో ఉన్నారు. దాంతో ఒక్కుదుటున పారామోటార్ సముద్రంలో కూలిపోయింది. విద్యాధర్ పారామోటర్ నుంచి సముద్రంలోకి దూకేశాడు కానీ, మధుసూదన్ రెడ్డి మాత్రం పారామోటార్ కు ఉన్న తాళ్లలో చిక్కుకుని సముద్రపు నీటిలో మునిగిపోయాడు.
ఈ ప్రమాదాన్ని బీచ్ లో ఉన్న మత్స్యకారులు గుర్తించి వెంటనే సహాయకచర్యలకు ఉపక్రమించారు. మొదట విద్యాధర్ ను బయటికి తీసుకువచ్చారు. అయితే, మోటార్ బరువుకు నీటిలో మునిగిపోయిన కెప్టెన్ ను గుర్తించేందుకు ఎంతో శ్రమించారు. చాలాసేపటి తర్వాత కనిపించగా, ఆయను కూడా వెలుపలికి తీసుకువచ్చారు. అయితే అంబులెన్స్ వచ్చేసరికి ఆలస్యం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే కెప్టెన్ మధుసూదన్ రెడ్డి మృతి చెందాడు. దాంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.