T-90 Tanks: మన టి-90 ట్యాంకుల ముందు చైనా తేలికపాటి ట్యాంకులు నిలవలేవు: ఆర్మీ కమాండర్ల వెల్లడి
- భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం
- ఇరు దేశాలు పోటాపోటీగా మోహరింపులు
- టి-15 లైట్ ట్యాంకులు మోహరించిన చైనా
- ఇవి కనీసం టి-72 ట్యాంకులకు కూడా పోటీనివ్వలేవన్న భారత్
లడఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో ఘర్షణల అనంతరం భారత్-చైనా సరిహద్దుల్లో అప్రకటిత యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇరు దేశాలు ఇంచుమించు తమ అత్యుత్తమ ఆయుధాలను సరిహద్దులో మోహరించడంతో ఇప్పుడక్కడ పరిస్థితి అత్యంత సున్నితంగా మారింది.
ఈ నేపథ్యంలో భారత సైనిక కమాండర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తూర్పు లడఖ్, టిబెట్ పీఠభూమి లోని యుద్ధక్షేత్రాల్లో ఇరుదేశాల మధ్య ట్యాంకుల పోరాటం జరిగితే మాత్రం మన టి-90 భీష్మ ట్యాంకుల ముందు చైనా తేలికపాటి ట్యాంకులు ఏమాత్రం నిలవలేవని కమాండర్లు వెల్లడించారు. కనీసం చైనా ట్యాంకులు మన టి-72 ట్యాంకులను కూడా ఎదుర్కోలేవని వివరించారు.
భారత సైన్యానికి చెందిన ఓ ట్యాంకు కమాండర్ మాట్లాడుతూ, టి-90, టి-72 ట్యాంకులతో పాటు బీఎంపీ-2 ఇన్ ఫాంట్రీ కంబాట్ వెహికిల్స్ 50 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలోనూ, మైనస్ 40 డిగ్రీల భయంకరమైన చలి వాతావరణంలో భేషుగ్గా పనిచేస్తాయని, ప్రపంచంలోని ఎలాంటి ప్రాంతంలోనైనా ఈ ట్యాంకులను మోహరించవచ్చని వివరించారు. రష్యా తయారీ అయిన టి-90 ట్యాంకులు గడ్డకట్టించే చలిలోనూ పనిచేస్తాయని తెలిపారు.
భారత్ తో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాక చైనా ఎల్ఏసీ వెంబడి పర్వతప్రాంతాలకు తన టి-15 లైట్ వెయిట్ ట్యాంకులను తరలిస్తోంది. ఇవి పర్వత ప్రాంతాల్లో సమర్థంగా పోరాడతాయని చైనా మీడియా చెబుతోంది.