bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటులో బీజేపీ-జేడీయూ 50:50 ఫార్ములా
- బీహార్ లో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలు
- జేడీయూ 122, బీజేపీ 121 సీట్లల్లో పోటీ
- జితన్ రామ్ మంఝీ పార్టీకి జేడీయూ సీట్లు
- రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీకి బీజేపీ కోటాలోంచి సీట్లు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రధాన పార్టీలు పొత్తులు పెట్టుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసి సీట్ల సర్దుబాటు చేసుకుంది. తాజాగా, జేడీయూ, బీజేపీ కూడా సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. బీహార్ లో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా జేడీయూ 122, బీజేపీ 121 సీట్లల్లో పోటీ చేయనున్నాయి.
జితన్ రామ్ మంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీకి జేడీయూ కోటాలో సీట్లు ఇవ్వనున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీకి బీజేపీ పలు సీట్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం నితిశ్ కుమార్, పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు మధ్య వచ్చిన విభేదాలు ఆ కూటమిని కాస్త ఇరుకున పెట్టేలా ఉన్నాయి.
సీట్ల సర్దుబాటును త్వరగా పూర్తి చేయాలని పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వారం రోజుల క్రితమే అల్టిమేటం ఇచ్చారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగునున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బీహార్‌లో అక్టోబరు 28, నవంబరు 3, 7 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబరు 10న ఫలితాలు వెల్లడవుతాయి. కరోనా నేపథ్యంలో దేశంలో జరుగుతోన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే.