Gold: డీలా పడిన బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు!
- రూ. 510 పతనమైన డిసెంబర్ కాంట్రాక్టు
- పది గ్రాములకు రూ. 50,060కి చేరిక
- కిలో వెండి ధర రూ. 60,469
విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. స్టాక్ మార్కెట్లలో లాభాలు నమోదవుతున్న సమయంలో, మార్కెట్లోని తమ పెట్టుబడులను ఇన్వెస్టర్లు బులియన్ వైపు మళ్లిస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో డిసెంబర్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాముల బంగారానికి రూ. 510 పతనమై రూ. 50,060కి, వెండి ధర కిలోకు రూ.676 పడిపోయి రూ. 60,469 వద్దకు చేరుకున్నాయి.
ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లలోనూ ధరలు స్వల్పంగా పడిపోయాయి. న్యూయార్క్ కామెక్స్ లో ఔన్సు బంగారం ధర 0.5 శాతం నష్టంతో 1,898 డాలర్లకు చేరగా, స్పాట్ మార్కెట్లో 0.4 శాతం మేరకు ధర తగ్గి 1,893 డాలర్లకు చేరుకుంది. వెండి ధర కూడా అదే దారిలో పయనించి 0.45 శాతం పడిపోయి 23.93 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.