DK Sivakumar: కర్ణాటక కాంగ్రెస్ నేత ఇంట కీలక ఆధారాలు సంపాదించిన సీబీఐ!
- దాడుల్లో పాల్గొన్న 60 మందికి పైగా అధికారులు
- శివకుమార్ సోదరుడు సురేశ్ ఇళ్లలోనూ సోదాలు
- కుట్ర పూరిత రాజకీయాలంటున్న కాంగ్రెస్
మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ నివాసం సహా 15 ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 60 మందికి పైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొని శివకుమార్ సోదరుడు సురేశ్ నివాసాలు, ఆయన కార్యాలయాల్లోనూ దాడులు జరిపారు.
కన్నడనాట ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సీబీఐ దాడులు రాజకీయ కలకలం రేపగా, తమపై కక్ష సాధింపు చర్యలకు బీజేపీ దిగుతోందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీ, సీఎం యడియూరప్ప చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందని, వారిద్దరి ఆదేశాలతోనే దాడులకు దిగారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాగా, ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ ఇటువంటి చర్యలకు దిగుతోందని మాజీ సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా మండిపడ్డారు.ఇటువంటి చర్యలతో తమను భయాందోళనలకు గురిచేయలేరని, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.
ఇదిలావుండగా, మనీ లాండరింగ్ కేసులో 2019 సెప్టెంబర్ లో డీకే శివకుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఆయన దాదాపు 50 రోజులు జైల్లో ఉన్నారు. ఆపై బెయిల్ మంజూరైంది. తిరిగి ఇప్పుడు అదే కేసులో దాడులు జరగడం గమనార్హం.