Puri Jagannadh: ఇప్పుడు దేశంలో డ్రగ్స్‌ ఫెస్టివల్ కొనసాగుతోంది: పూరీ జగన్నాథ్ సెటైర్

puri on rapes cases in india

  • ప్రతి 15 నిమిషాలకు ఓ అత్యాచారం
  • ప్రతి రోజు 100 అత్యాచార కేసులు నమోదు
  • ప్రతి రోజు దాదాపు 4 లక్షలపైగా దాడులు
  • దిశకు జరిగిన న్యాయం ప్రతి అమ్మాయికి జరగాలి

దేశంలో జరుగుతోన్న అత్యాచార ఘటనలపై దర్శకుడు పూరీ జగన్నాథ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేశారు. దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి రోజు 100 అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయని, మహిళలపై ప్రతి రోజు దాదాపు 4 లక్షలపైగా దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. హత్రాస్‌లో నిందితులు అత్యాచారం చేయడమే కాకుండా దారుణంగా ఆమెను హింసించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాటం చేయాల్సి వస్తోందని ఆయన చెప్పారు.

భారత్‌లో మహిళల కోసం మహిళలే పోరాడాల్సి వస్తోందని, పురుషులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. వరుసగా జరుగుతోన్న పలు ఘటనలను ఆయన గుర్తు చేశారు. కొన్నాళ్లు ఆత్మహత్యల పరంపర కొనసాగిందని, బాలీవుడ్ హీరో సుశాంత్‌ ఒక్కడే కాదని, దేశంలో అదే సమయంలో భారత్‌లో 300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.

భారత్‌, చైనా సరిహద్దుల్లోని గాల్వాన్‌ వ్యాలీలో దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల పేర్లు ఎవరికీ తెలియదని, ఆ మహావీరుల గురించి ఆలోచించారా? అని ఆయన ప్రశ్నించారు. అనంతరం దేశంలో బంధుప్రీతి ఫెస్టివల్ జరిగిందని, ఆ విషయంపై మాట్లాడుకున్నారని తెలిపారు. నటులను అణచివేస్తున్నారని మాట్లాడుకోవడం  ఓ అవివేకమని ఆయన చెప్పారు.

సుశాంత్‌ సింగ్‌‌ ఒక స్టార్ అని, కొత్త హీరోల సినిమాలు ఎన్నో విడుదలవుతుంటాయని ఆయన తెలిపారు. వారి సినిమాలు విడుదలైనప్పుడు ఒక్క థియేటరైనా నిండిందా? అని ఆయన ప్రశ్నించారు. అయితే, ఆ కొత్త హీరోలను ప్రోత్సహిద్దామని ప్రేక్షకులు టిక్కెట్‌ కొన్నారా? అని ఆయన నిలదీశారు. ప్రేక్షకులు చివరికి స్టార్స్‌ సినిమాలే చూస్తారని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఇప్పుడు దేశంలో డ్రగ్స్‌ ఫెస్టివల్ కొనసాగుతోందని, సినీనటులను తీసుకువెళ్లి ఫ్యాషన్‌ పరేడ్‌లు పెట్టారని ఆయన చెప్పారు. కాగా, మహిళల కోసం పోరాడాలని దిశకు జరిగిన న్యాయం ఈ దేశంలో ప్రతి అమ్మాయికి జరగాలని ఆయన కోరారు. ఆగస్టు 15న దేశం స్వాతంత్య్రదినోత్సవం జరుపుకుంటుంటే, మరోవైపు ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేశారని, ఇది ఎవరికైనా తెలుసా? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News