Jeevan Reddy: రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి: జీవన్ రెడ్డి
- మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలన్న జీవన్ రెడ్డి
- పరస్పర ఆరోపణలతో డ్రామాలు ఆడుతున్నాయని ఆగ్రహం
- కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతుల పరిస్థితిపై స్పందించారు. రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరపై పరస్పర ఆరోపణలతో డ్రామాలు కూడా ఆడుతున్నాయని మండిపడ్డారు. మొక్కజొన్నకు మద్దతు ధర ఇచ్చి, ఆ తర్వాతే చట్టాల గురించి మాట్లాడాలని అన్నారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, ఆ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇటీవలే నూతన వ్యవసాయ చట్టం తీసుకురాగా, కేసీఆర్ ప్రభుత్వం దానిని వ్యతిరేకిస్తోంది. సంబంధిత బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కూడా టీఆర్ఎస్ వాటికి వ్యతిరేకంగా వ్యవహరించింది.