Murali Mohan: బాలు 'భారతరత్న' అవార్డుకు అన్ని విధాలా అర్హుడు!: మురళీమోహన్
- హైదరాబాదులో ఎస్పీ బాలు సంస్మరణ సభ
- వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సభ
- హాజరైన మురళీమోహన్
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వంశీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక సభ నిర్వహించింది. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలు 16 భాషల్లో 40 వేల పాటలు పాడారని, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా బహుముఖ ప్రతిభ చాటారని కొనియాడారు.
పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా బాలు ఎంతోమంది యువ గాయకులను సినీ రంగానికి పరిచయం చేశారని మురళీమోహన్ వెల్లడించారు. బాలు 'భారతరత్న' అవార్డుకు అన్ని విధాలా అర్హుడని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ప్రధానమంత్రికి ఇప్పటికే లేఖ రాసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.