Vallabhaneni Vamsi: అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో వంశీ.. జగన్ ను కలిసేందుకు యత్నం!
- గన్నవరం వైసీపీలో ముదురుతున్న వర్గపోరు
- వంశీని వ్యతిరేకిస్తున్న దుట్టా, యార్లగడ్డ
- హైకమాండ్ కూడా పట్టించుకోవడం లేదనే బాధలో వంశీ
గన్నవరం నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు ముదురుతోంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి, వైసీపీ గూటికి చేరడంతో పార్టీలో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. అప్పటికే పార్టీలో ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు వంశీని వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగానే వంశీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందరినీ కలుపుకుని పోతానని వంశీ ప్రకటించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.
జరుగుతున్న పరిణామాలను పార్టీ హైకమాండ్ కూడా చూసీచూడనట్టు వదిలేయడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి జగన్ ను కలవాలని వంశీ నిర్ణయించారు. అవసరమైతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునే యోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, తాము జగన్ నాయకత్వంలో పని చేస్తున్నప్పటికీ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వంశీ వర్గీయులు కూడా అసహనంగా ఉన్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో గన్నవరం వైసీపీలో ఏం జరగబోతోందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.